13-05-2024 RJ
జాతీయం
దేశవ్యాప్తంగా నాలుగోవిడత ఎన్నికలు ఉత్సాహంగా సాగాయి. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో పార్లమెంట్ ఎన్నికలతో పాటు, ఎపిలో అసెంబ్లీ ఎన్నికలకు ఓటేసేందుకు ప్రజలు బారులు తీరారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రజలు ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లడం ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పుకోవాలి. అయినా ఓటర్లు ఇంకా ఇల్లు విడిచి బయటకు రావాడానికి వెనకాడడం సహించరాని నేరంగా పరిగణించాలి. ఓటర్లు అంతా నూటికినూరు శాతం కాకున్నా కనీసం 90శాతం మంది ఓటేస్తేనే ప్రజల పూర్తి అభిప్రాయం తెలుస్తుంది. ఇందుకోసం కఠిన చట్టాలను తీసుకుని రావాలి. ఓటేయడం ఖచ్చితం చేయాల్సిన ఆగత్యం వరుస ఎన్నికల్లో ఓటింగ్ శాతాలను బ్టటి తెలుస్తోంది. ఇప్పటికే మూడుదశల్లో ఎన్నికలు ముగిసాయి. ఈ ఎన్నికల్లో కూడా 70శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. నాలుగో విడత కూడా మందకొడిగానే పూర్తి కావచ్చింది. ప్రజలు ఎవరికి అధికారం కట్టబెట్టాలో తీర్పునిచ్చారు. మరో మూడు విడుతల్లో జూన్ 1 వరకు ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడితో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో తేలనుంది. ఈ మూడు విడతల్లో అయినా మరింత ఉత్సాహంగా ఓటేసేలా ప్రజలు ముందుకు రావాలి. ఇకపోతే ఎన్నికల చట్టంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఇన్నేళ్లుగా వస్తున్న ఓట్ల పండగలను బట్టి గమనించవచ్చు.
ప్రధానంగా పటిష్టమైన ఓటురాకార్డు..పర్మినెంట్‌గా ఉండేలా చర్యలు తీసుకోవాలి. మనిషి మరణించేవారకు ఓటును ఆధార్, పాన్‌లాగా దాచుకునేలా పటిష్టం చేయాలి. అలాగే ఓటు వేయడం అన్నది విధిగా చేయాలి. ఇంట్లో కూర్చుని ఓటేయకపోవడాన్ని నేరంగా పరిగణించాలి. ఈ రెండూ చేస్తే కొంత మార్పు రావచ్చు. ఇకపోతే రాజకీయ పార్టీల ప్రలోభాలను అరికట్టాలి. డబ్బుల పంపిణీ, గిఫ్టుల పంపిణీ చేస్తే పార్టీల గుర్తు రద్దు చేసేలా చేయాలి. అట్టహాసంగా సభలు పెట్టే దానిని కూడా నియంత్రించాలి. సోషల్ విూడియా, టివి రంగం అందుబాటులోకి వచ్చింది కనుక ప్రచారం పరిమితం చేయాలి. జనాలను అదేపనిగా లక్షల సంఖ్యలో తరలించి భారీ బహిరంగ సభలను నిర్వహించే పద్దతిని నిర్మూలించగలగాలి. ఎన్నికలను రాజకీయ పార్టీలు ఖరీదైనవిగా చేస్తూ పోతున్నాయి. సామాన్యులు పోటీ చేయకుండా అడ్డుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేరస్థులు, గుండాలు, డబ్బున్న వారు మాత్రమే పోటీ చేయగలుగుతున్నారు. ఇకపోతే జనాభా నియంత్రణ కూడా ఇందులో జోడిరచాలి. అత్యధిక మందిని కంటున్న వారిపై ఆంక్షలు పెట్టాలి. అలాంటివారు పోటీచేయకుండా, ఓటేయకుండా చేయాలి.
ఎన్నికల సంస్కరణలపై కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం చర్చించాలి. పటిష్టమైన ఎన్నికల విధానం రావాలి. అలా వచ్చిన తరవాత ఎన్నికైన వారు ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకునేలా మన వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టాలి. ఈ క్రమంలో ఇప్పటికైనా పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యయుతంగా చర్చలకు అవకాశం రావాలి. ప్రధానంగా కేంద్ర రాష్టాల్ర మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. కేంద్ర,రాష్టాల్ల్రో ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నా ప్రజాస్వామ్యం దెబ్బతినరాదు. ప్రజల తీర్పును అపహాస్యం చేయరాదు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్టాల్ర హక్కులను కాపాడడంతో పాటు సంబంధాలను బలపర్చాలి. కేంద్ర,రాష్ట్ర సంబంధాలు, సమాఖ్య వ్యవస్థపై జరుగుతున్న దాడి, గవర్నర్ వ్యవస్థ ద్వారా కేంద్రం పెత్తనం చెలాయించేలా చేస్తున్న ప్రయత్నాల ను అడ్డుకునేలా చట్టాలు రావాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశాలపై చర్చ చేయాలి. ప్రాంతీయపార్టీలు ఇవే అంశాలపై ఆందోళన చెందుతున్నాయి. దీనిపై ఉమ్మడిగా పోరాడాలన్న ప్రయత్నాలు వ్యక్తం అవుతున్నా సంఘటితం కాలేకపోతున్నాయి. ప్రాంతీయ పార్టీల మధ్య సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సిఎంలు ఏకాభి ప్రాయానికి రావాల్సి ఉంది. నిజానికి గవర్నర్ వ్యవస్థను కాంగ్రెస్ బాగా భ్రష్టు పట్టించింది. దీనిని రద్దు చేయాలన్న అభిప్రాయం ఉంది.
రాజకీయపార్టీలు ముందుగా ఈ విషయంలో చర్చచేయాల్సి ఉంది. మన రాజ్యాంగ నిర్మాతలు కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలుగా విభజించారు. పంచాయత్‌రాజ్ చట్టం ఆమోదించిన తర్వాత, స్థానిక స్వపరిపాలన సంస్థలకు హక్కులు ఇవ్వబడ్డాయి. వాటికి అధికారాలు కేటాయించబడ్డాయి. గ్రామాలు అభివృద్ధి చెందాలి. గ్రామాల అభివృద్ధితో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్టాల్ర అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుంది. దేశంలోని గ్రామాలు, రాష్టాల్ర అధికారాలను నిర్వీర్యం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్న తీరు సరికాది. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. కేంద్రం తరచూ రాజ్యాంగం నిర్వచించిన అధికార పరిధిని ఉల్లంఘిస్తోంది. కేంద్ర తన పరిధిని విస్తరించే క్రమంలో రాష్టాల్ర అధికారాలను ఆక్రమించాలని చూస్తోంది.
ఇది కాంగ్రెస్ హయాంలోనూ జరిగింది. ఇప్పుడు మోడీ హయాంలో నిత్యం జరుగుతోంది. నిజానికి కేంద్ర, రాష్ట్ర సంబంధాలు బలహీనపడ్డాయి. అందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రభుత్వమే కారణమని చెప్పుకోవాలి. రాజ్యకాంక్ష విస్తరణతో రాష్టాల్ర హక్కులను కాలరాస్తున్నారు. జాతీయ విధానాలను తుంగలో తొక్కారు. రాష్టాల్రన్ని కలిస్తేనే దేశం అవుతుంది. అలాంటి రాష్టాల్రను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రతి దానికీ బిచ్చం ఎత్తుకునేలా పరిస్థితి తీసుకుని వచ్చారు. అలాగే రాష్టాల్రు, స్థానిక సంస్థలను లొంగదీసుకునే ఉద్దేశ్యంతో వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి రావాల్సిన నిధులు సక్రమంగా విడుదల కావాలి. ఏ పనులకు కేటాయించిన నిధులు అవి పూర్తి చేసేలా చూడాలి. రానున్న కొత్త ప్రభుత్వం రాష్టాల్రను విశ్వాసంలోకి తీసుకుని పార్లమెంట్ వేదికగా అన్ని అంశాలు చర్చించాలి. రాష్టాల్రు లేవనెత్తే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పార్లమెంటులో చట్టాలను ఎటువంటి చర్చ లేకుండా ఆమోదించుకుంటున్న తీరు గత పదేళ్లుగా చూస్తున్నాం. ప్రతిపక్ష పార్టీలు పాలించే రాష్టాల్ల్రో రాజ్‌భవన్ ద్వారా సమాంతర ప్రభుత్వాన్ని నడపాలని చూసారు. ఇలా ప్రతి అంశాన్ని చర్చించి అందుకు అనుగుణంగా మన ఎన్నికల సంఘాన్ని, రాజ్యాంగాన్ని బలోపేతం చేసి భారత ప్రజాస్వామ్యాన్ని ఆదర్శంగా నిలపాలి.