13-05-2024 RJ
జాతీయం
వారణాసి, మే 13: ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం నగరంలో భారీ రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షో ప్రారంభించడానికి ముందు లంక ప్రాంతంలోని మాలవ్య చౌరస్తా వద్ద ఉన్న విద్యావేత్త, సంఘ సంస్కర్త మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి ప్రధాని మోడీ పూలమాల వేసి నివాళులర్పించారు. మంగళవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్న ప్రధాని మోడీ వెంట ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రోడ్‌షోలో పాల్గొన్నారు. 7వ దశ లోక్‌సభ ఎన్నికలలో జూన్ 1న వారణాసి స్థానానికి పోలింగ్ జరగనున్నది. ప్రధాని మోడీ వరుసగా మూడవ పర్యాయం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.
మాత్రాశక్తికి ప్రతిరూపంగా కాషాయ రంగు వస్త్రాలు ధరించి మహిళలు పెద్ద సంఖ్యలో మోడీ ప్రయాణిస్తున్న వాహనం ముందు నడిచారు. మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, మహేశ్వరి, మార్వారీ, తమిళ, పంజాబీ తదితర భాషలకు చెందిన ప్రజలు 11 జోన్లలోని 100 పాయింట్ల వద్ద ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికారు.శంఖనాదాలు, డోలు, డమరుక వాయిద్యాల హోరుతో రోడ్‌షో మార్మోగిపోయింది. రోడ్‌షో మార్గం పొడవునా కాశీ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యక్తుల కటౌట్లను అమర్చారు. సంత్ రవిదాస్ గేట్, అస్సీ, శివాల, సోనార్‌పురా, జంగంబాడి, గోదౌలియా విూదుగా రోడ్‌షో కాశీ విశ్వనాథుని ఆలయం వరకు సాగింది.
అనంతరం గంగానదిలో పుణ్య స్నానమాచరించిన మోడీ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం బిఎల్‌డబ్లు అతిథిగృహంలో ప్రధాని మోడీ రాత్రి బసచేశారు. కాశీ విశ్వనాథుని మందిరం నుంచి బయల్దేరిన ప్రధాని మోడీ కాన్వాయ్ మైదాగిన్ చౌరహా, కబీర్‌చౌర, లాహురబీర్ తేలియాబాగ్ తిరాహా, చౌకాఘాట్ చౌరాహా, లక్డీ మండి, కంటోన్మెంట్ ఓవర్‌బ్రిడ్జి, లహార్తరా, మండూవాదీ చౌరహా, కాకర్‌మట్ట ఓవర్‌బ్రిడ్జి ప్రాంతాల విూదుగా బిఎల్‌డబ్లు అతిథిగృహం చేరుకుంది.