14-05-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, మే 14: లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ఇప్పటికే 270 సీట్లు గెలిచినట్టు తాను చెప్పగలనని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. నాలుగు దశల్లో అవసరమైన సీట్లు గెలిబోతున్నామని అన్నారు. 400కు పైగా సీట్లలో గెలుపు సాధించడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో తాము పోరాడుతున్నామని పశ్చిమబెంగాల్లోని బాంగావ్‌లో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ చెప్పారు. ఇంతవరకూ నాలుగు విడతల పోలింగ్ పూర్తయింది. 380 సీట్లకు ఎన్నికలు జరిగాయి. బెంగాల్‌లో కూడా 18 సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. 380 సీట్లలో ప్రధాని మోదీ 270 సీట్లు గెలుచుకోవడం ద్వారా సంపూర్ణ మెజారిటీని సాధించారని నేను కచ్చితంగా చెప్పగలను. 400కు పైగా సీట్లు గెలుచుకోవడమే మా లక్ష్యం అని అమిత్‌షా అన్నారు.
సీఏఏపై మమతా బెనర్జీ అపోహలు వ్యాప్తి చేస్తున్నారని, ఈ చట్టం కింద మతువా తెగల వారు పౌరసత్వం పొందుతారని ఆయన హావిూ ఇచ్చారు. సీఏఏ కేంద్ర ప్రభుత్వ చట్టమైనందున దానిని అమలు కాకుండా మమతా బెనర్జీ ఎంతమాత్రం అడ్డుకోలేరని స్పష్టం చేశారు. శరణార్ధులైన సోదరులకు దేశ పౌరసత్వం లభించకుండా ఈ ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదన్నారు. ఇది మోదీ ఇచ్చిన వాగ్దానమని గుర్తుచేశారు. పౌరసత్వం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఉన్న విశిష్ఠ అధికారమే కానీ, రాష్ట్ర ప్రభుత్వాలది కాదనే విషయం మమతా బెనర్జీ గుర్తుంచుకోవాలన్నారు.