16-05-2024 RJ
జాతీయం
కాంగ్రెస్ పార్టీలోఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఇండియా కూటమి విజయం సాధిస్తుందన్న ధీమాతో నేతలు ఉన్నారు. ఇండియా కూటమి నేతల్లో సైతం ఆత్మ విశ్వాసం పెరిగింది. కాంగ్రెస్ నేతలు కూడా ఇక ప్రభుత్వం తమదే అన్న ధీమాలో ఉన్నారు. ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ప్రజలకు ఆ మాత్రం విశ్వాసం కల్పించాల్సిందే. లేకుంటే ప్రజలు కూడా నమ్మరు. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు ముగిశాయి. మరో మూడు విడుతల్లో ఎన్నికలతో జూన్ 1న పోలింగ్ ముగియనుంది. ప్రజలు కాంగ్రెస్‌ను ఏ మేరకు నమ్మారన్నది జూన్ 4న ఫలితాల్లో తేలనుంది.
వారి విధానాలు ప్రజలకు చేరాయా...కాంగ్రెస్‌ను నమ్మవచ్చా లేదా అన్నది కూడా తేల్చనున్నారు. రాహుల్ గాంధీ వయనాడ్‌తో పాటు, రాయబరేలిలో పోటీ చేస్తున్నారు. అమేథీలో పోటీకి వెనుకంజ వేశారు. అలాగే వయనాడ్ ఎన్నిక ముగిసిన తరవాతనే రాయబరేలి ని ఎంచుకోవడం గమనించవచ్చు ఎందుకంటే ఎక్కడో భయం వెన్నాడుతోంది. ఇంతకాలం తమకు బడుగుబలహీన వర్గాలు, మైనార్టీలు అండగా ఉన్నారని భావించినా గత రెండు ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డది.
రాష్టాల్ర ఎన్నికల్లోనూ అదే పరాభవం ఎదురయ్యింది. ఈ క్రమంలో బిసి గణన, రిజర్వేషన్ల అంశం నెత్తికెత్తుకుంది. ఈ వర్గాలను నమ్మించడానికి ఇంతకన్నా వేరు మార్గం కాంగ్రెస్ ముందు లేదు. అలాగే దేశవ్యాప్తంగా మళ్లీ బలం పుంజుకోవడానికి, దూరమైన వర్గాలను దగ్గరకు చేర్చుకునేందుకు పాదయాత్రలు, ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు రాహుల్ పాదయాత్ర చేపట్టారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై పోరాటాలు ప్రారంభించారు. ప్రజల్లో ఈ అంశాలపై చర్చించారు. మొత్తంగా ఇంత కాలం ప్రజలకు దూరంగా ఉంటూ వచ్చిన కాంగ్రెస్ గత రెండేళ్లలో అనే కార్యక్రమాలు, ఆందోళనల ద్వారా ప్రజలకు చేరువ కావాలన్న సంకల్పంతో మల్లీ అధికారం కోసం ఈ ఎన్నికల్లో పోరాడుతోంది. ఇండియా కూటమిలో అన్ని పార్టీలు మనస్ఫూర్తిగా చేరకున్నా..ఉన్న పార్టీలను కలుపుకుని పోవడం కొంత కలసివచ్చే అంశమే.
అయితే ప్రజలు ఎందుకు దూరమ్యారో..వారిని ఎలా దరికి చేర్చుకోవాలో ఆత్మపరిశీలన కూడా అవసరమే. గత పదేళ్ల యూపిఎ హయాంలో జరిగిన పొరపాట్లను, కుంభకోణాలపై ప్రజలకు వివరణ ఇచ్చుకోవాల్సి ఉన్నా వాటికి జోలికి వెళ్లడం లేదు. స్వాతంత్య్రం తామే తెచ్చామని, అభివృద్ది అంతా తమ హయాంలోనే జరిగిందని గొప్పలు చెప్పుకోవడం మానాలి. దేశవ్యాప్తంగా బలం పుంజుకోవడానికి, దూరమైన వర్గాలను దరిజేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం మంచిదే అయినా..ప్రజలకు ఏంచేయబోతున్నారో.. చెప్పుకునేందుకు సిద్దంగా ఉండాలి. కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు ’భారత్ జోడో యాత్ర’ పేరిట రాహుల్ పాదయాత్ర కొంత కదలిక తీసుకుని వచ్చింది. ప్రధాని మోదీ హయాంలో సమాజంలో వివిధ వర్గాల మధ్య సామరస్యం దెబ్బ తిందని.. సామరస్యాన్ని పరిరక్షించేందుకు, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ’భారత్ జోడో యాత్ర’ ప్రారంభించా నని రాహుల్ ప్రకటించారు.
నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై ఎప్పటికప్పుడు కాంగ్రెస్ నేతలు నిలదీస్తూనే ఉన్నారు. ఇకపోతే బిసి గణన లన్నది ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తదన్నది చూడాలి. అన్ని స్థాయుల పదవుల్లో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు ఇస్తున్న 20 శాతం ప్రాతినిధ్యాన్ని 50 శాతానికి పెంచాలని, ఉపకులాలకు కూడా అత్యధిక ప్రాధాన్యమివ్వాలని కాంగ్రెస్ తన లక్ష్యంగా పేర్కొంది. నిజానికి ఈ వర్గాలన్నీ తొలుత కాంగ్రెస్ వెన్నంటే ఉన్నాయి. కానీ ప్రకటలనకే పరిమితం అయిన వీరి పురోభివృద్ది ఆచరణలో కానరాలేదు. కాలక్రమంలో ఈ వర్గాలన్ని క్రమంగా దూరం అవుతూ వచ్చాయి. దీంతో మళ్లీ ఈ వర్గాలను దగ్గరకు చేర్చుకునే అవసరం ఏర్పడిరది. ప్రజలను దూరం చేసుకున్నామన్న బాధను రాహుల్ గుర్తించారు. అందువల్ల సుదీర్ఘ ప్రణాళికలో ఈ ఎన్నికల్లో పోరాడుతున్నారు. సంస్థాగతంగా చేయాల్సిన మార్పులకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. పార్టీ సంస్థాగత స్వరూపం, పదవుల నియామక నిబంధనలు, కమ్యూనికేషన్లు, పబ్లిసిటీ, ప్రజలకు చేరువ కావడం, నిధులు, ఎన్నికల నిర్వహణ వంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుత కష్టనష్టాలను కచ్చితంగా అధిగమిస్తామని, ఇదే మన సంకల్పమని సోనియా ప్రకటించారు. ఇదంతా బాగానే ఉన్నా కొన్ని విప్లవాత్మక విషయాల్లో మోడీ తీసుకున్న నిర్ణయాలపై పార్టీ వైఖరిని చర్చించలేదు. కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు, ఉమ్మడి పౌరస్మృతి వంటి విషయాల్లో కాంగ్రెస్ విపక్షాల ధోరణి తిరోగమన దిశగా ఉన్నాయి. ప్రభుత్వరంగ సంస్థలను మోడీ ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్ముతున్న క్రమంలో దీనిని అడ్డుకోవడానికి ఏం చేయబోతున్నారో చెప్పలేదు. కరోనా అనంతర విపత్క పరిస్థితుల్లో ఆర్థికరంగం కుదేలయ్యింది. దీన్ని ఎలా చేస్తే ముందుకు పోతామో ఓ విధానపత్రం ప్రకటించి ఉంటే బాగుండేది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈవీఎంలను తొలగిస్తామని, వాటి స్థానంలో బ్యాలెట్లను పునరుద్ధరిస్తామని చెప్పడం ద్వారా సాంకేతికతను అవహేళన చ ఏయడం తప్ప మరోటి కాదు.
ఇలా అన్ని విషయాల్లో కాంగ్రెస్ వైఖరి ఇదని ప్రకటించి ఉంటే ప్రజలు నమ్మేవారు. కానీ అలా చేయలేక పోయారు. మేనిఫెస్టోలో కేవలం తాయిలాతు మాత్రమే ప్రకటిచారు. దేశానికి దివానిర్దేశం చేయగల విధానాలను పొందుపర్చలేదు. అయితే కాంగ్రెస్ మాత్రం ఎన్నికల ఫలితాలపై ధీమాగా ఉంది. మొత్తంగా దూరమైన ప్రజలను దగ్గరకు చేర్చుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీపై విశ్వసనీయత పెరిగేలా కసరత్తు మాత్రం చేశారు. ఈ కసరత్తు ఫలిస్తుందా...లేదా అన్నది జూన్ 4న ప్రకటించే ఫలితాల్లో వెల్లడి కానుంది.