17-05-2024 RJ
జాతీయం
లక్నో, మే 17: రాయబరేలి ప్రజలు ప్రధానిని ఎన్నుకుంటారంటూ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం ’హ్యాట్రిక్’ సాధించి తీరుతుందని అన్నారు. ప్రజలు అభివృద్దికి పట్టం కడతారని అన్నారు. ’ఇండియా’ కూటమి నేతలు ఒక్కొక్కరే జారుకుంటున్నారని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ రాజకుమారుడు అఖిలేష్ యాదవ్ ఒక కొత్త ఆంటీ (మమతా బెనర్జీ) గొడుగు కింద చేరారు. ఆ కొత్త ఆంటీ పశ్చిమబెంగాల్‌లో ఉంది. విూకు బయట నుంచి మద్దతు ఇస్తామని ఆ కొత్త ఆంటీ ఇండియా కూటమికి చెబుతోందని మోదీ వ్యాఖ్యానించారు. దేశాన్ని మెరుగుపరచేందుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ఒకవైపు, దేశంలో అస్థిరత సృష్టించేందుకు ఇండియా కూటమి ఒకవైపు ఉందని, ఎన్నికలు నడుస్తున్న కొద్దీ ఇండియా కూటమి నేతలు ఒక్కొక్కరే కూటమి నుంచి జారిపోరుతున్నారని చెప్పారు.
కేంద్రంలో రాబోయే కొత్త ప్రభుత్వంలో పేదలు, యువకులు, మహిళలు, రైతుల కోసం ఎన్నో పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకోనున్నామని మోదీ చెప్పారు. జాతీయ ప్రయోజనాలకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అంకితమైందని చెప్పారు. ఇండియా కూటమి నేతలు ప్రధానులవుతామంటూ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తాను ’హ్యాట్రిక్’ కొట్టేందుకు, సమాజంలోని అన్నివర్గాల కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 500 ఏళ్ల తర్వాత రామాలయం కల సాకారమైందంటే దానికి ప్రజల ఓటు బలమే అందుకు కారణమని అన్నారు.
రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసిరాజనేందుకు, మందిరంపై బుల్‌డోజర్ నడిపేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్టు తమకు తెలిసిందని, న్యాయబద్ధంగా బుల్డోజర్ నడిపించడం ఎలాగో యోగి ఆదిత్యనాథ్ నుంచి కాంగ్రెస్ వాళ్లు తెలుసుకోవాలని సూచించారు. ఇండియా బ్లాక్‌కు ప్రజలు ఓటు వేసి అధికారం ఇస్తే, ఎస్సీ, ఎస్టీ, ఆదివాదీ, ఓబీసీల రిజర్వేషన్లను లాక్కొని తమ ఓటర్లకు ఇవ్వడం ద్వారా బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని హెచ్చరించారు. ప్రధానమంత్రి యూపీలోని ఫతేపూర్, హవిూర్‌పూర్‌లోనూ శనివారంనాడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.