17-05-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, మే 17: సుప్రీంకోర్టులో వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. వైయస్ వివేకా హాత్య కేసు అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించ కూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. అలాగే వైయస్ షర్మిలతో పాటు ఇతరులపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులపైనా కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్నికల ప్రచారంలో వైయస్ వివేకా హత్య కేసు ప్రస్తావించవద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ఈ సందర్బంగా అభిప్రాయపడిరది. దీంతో ఈ అంశంలో వైయస్ షర్మిల, సునీత నర్రెడ్డిలకు ఊరట లభించినట్లు అయింది. అయితే ఇప్పటికే ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు పెద్దగా లాభించే అవకాశం లేదు.
కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల బరిలో దిగారు. ఆ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తన చిన్నాన్న వైయస్ వివేకా హత్య అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. ఈ హత్య కేసులో అసలు సిసలు సూత్రధారులంటూ కడప ప్రస్తుత ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కరరెడ్డిలను ఆమె వివిధ సందర్భాల్లో గుర్తు చేస్తున్నారు. అయితే ఈ హత్య కేసులో ప్రమేయమున్న వైయస్ అవినాష్ రెడ్డికి మరోసారి కడప ఎంపీ టికెట్.. ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ కేటాయించారంటూ వైయస్ షర్మిలతోపాటు వైయస్ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి నేరుగా ప్రజల్లోకి వెళ్లి ఆరోపణలు సంధిస్తున్నారు.
దీంతో ఎన్నికల ప్రచారంలో వైయస్ వివేకా హత్య కేసు అంశాన్ని వైయస్ షర్మిల, సునీత ప్రస్తావించ కుండా ఆదేశాలు ఇవ్వాలంటూ.. కడప జిల్లాలోని వైసీపీ నాయకులు స్థానిక జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో వైయస్ వివేకా హత్య కేసు అంశాన్ని ప్రస్తావించ వద్దంటూ ’వారిని’ కోర్టు ఆదేశించింది. దీనిపై వైయస్ షర్మిల, సునీత నర్రెడ్డిలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో వైయస్ వివేకా హత్య కేసు అంశంలో కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది.