18-05-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, మే 18: ఆమ్‌ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో బిభవ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై కేజీవ్రాల్ స్పందించారు. పార్టీ నేతలతో భాజపా ప్రధాన కార్యాలయానికి చేరుకుంటానని.. వీలైతే అందరినీ అరెస్టు చేసుకోవాలంటూ సవాల్ చేశారు. ప్రధాని మోదీ జీ.. విూరు ఆప్ నేతలైన మనీశ్ సిసోదియా, సంజయ్‌సింగ్, నాతో సహా ఒక్కొక్కరినీ కారాగారానికి పంపిస్తూ గేమ్ ఆడుతున్నారు.
ఇంకా ఎవరిని జైల్లో పెట్టాలనుకుంటున్నారు? రేపు మధ్యాహ్నం 12 గంటలకు నా పార్టీ నేతలు, కార్యకర్తలతో భాజపా ప్రధాన కార్యాలయానికి చేరుకుంటా. వారందరినీ ఒకేసారి అరెస్టు చేసుకోండి అంటూ కేజీవ్రాల్ ’ఎక్స్’ వేదికగా వీడియో పోస్టు చేశారు. ఇంతకీ ఆప్ ఏం తప్పు చేసింది?పేదలకు నాణ్యమైన విద్య, మొహల్లా క్లినిక్‌లను అందించడమే అది చేసిన తప్పా? మంచి పనులకు అడ్డుకట్ట వేసేందుకే భాజపా తీవ్రంగా యత్నిస్తోంది. మా నేతలందరినీ జైల్లో పెట్టి ఆప్‌ను నాశనం చేయాలని చూస్తోంది. అది ఎన్నటికీ జరగదు.
ఆప్ ప్రజల గుండెల్లో ఉందని కేజీవ్రాల్ దుయ్యబట్టారు. ఢిల్లీ సీఎం కేజీవ్రాల్ చేసిన వ్యాఖ్యలపై భాజపా స్పందించింది. సొంత పార్టీ మహిళా నేతపై జరిగిన దాడిపై కేజీవ్రాల్ మౌనం వహిస్తున్నారు. విూరు చేస్తున్న డ్రామాలు ఇక ఆపండి. ఆమెపై దాడి జరిగి రోజులు గడుస్తున్నా ఇంకా ఎందుకు పెదవివిప్పడం లేదు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరని భాజపా చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ప్రశ్నించారు.