18-05-2024 RJ
జాతీయం
అంబాలా/ముంబై, మే 18: కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనొక్కిచెప్పారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు మనపై ఏది చేయాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాడని అన్నారు. ఎన్నికల ఘట్టం చివరిదశకు చేరుకుంటున్న వేళ ప్రధాని మోడీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. హర్యానాలోని అంబాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ శనివారంనాడు ప్రసంగించారు. ఆరో విడత ఎన్నికల్లో భాగంగా హర్యానాలోని 10 లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరుగనుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ..దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటే, శత్రువులు మనపై ఏది చేయడానికైనా ముందు వందసార్లు ఆలోచిస్తారు.
పాకిస్థాన్ 70 ఏళ్ల నుంచి భారతదేశానికి ఇక్కట్లపాలు చేస్తోంది. వాళ్లకు చేతిలో బాంబులు ఉన్నాయి. ఇవాళ వాళ్ల చేతుల్లో భిక్షాపాత్ర ఉంది. బలమైన ప్రభుత్వం అనేది ఉంటే శత్రువులు వణుకుతారని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌ను ప్రస్తావిస్తూ, అక్కడి పరిస్థితిని బలహీన ప్రభుత్వం ఉంటే మార్చగలదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయాన్ని ఓసారి గుర్తుచేసుకుంటే హర్యానాలోని వీరమాతలు రేయింబవళ్లు ఆందోళనతో ఉండేవారనీ, ఈరోజు పదేళ్లుగా అవన్నీ ఆగిపోయాయని చెప్పారు. బలమైన మోదీ ప్రభుత్వం 370వ అధికరణ అనే గోడను కూల్చేసిందని, కశ్మీర్ అభివృద్ధి దిశగా పయనిస్తోందని తెలిపారు.
జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడడానికి మరో 17 రోజులే ఉన్నాయని, నాలుగు విడతల పోలింగ్‌లో ఇండియా కూటమి ఎత్తులను ప్రజలు చిత్తుచేశారని అన్నారు. దేశభక్తి నరనరాల్లో ఉన్న రాష్ట్రం హర్యానా అని, దేశవ్యతిరేక శక్తులు ఏవో ఇక్కడి ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. ప్రజల కలలు పండిరచడమే తన రిజల్యూషన్ అని, అదే తన గ్యారెంటీ అని మోదీ హావిూ ఇచ్చారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా రేయింబవళ్లు పనిచేస్తానని, వికసిత్ భారత్‌కు పేదలు, యువకులు, మహిళలు, రైతులు నాలుగు మూల స్తంభాలని చెప్పారు. నా దేశం, నా హిందుస్థాన్ బలపడాలనే ఆలోచనతో ఈ నాలుగు స్తంభాలను పటిష్టం చేస్తానని అన్నారు.
ఇకపోతే తరవాత మహారాష్ట్రలో పర్యటించారు. కాంగ్రెస్ చెబుతున్న మేనిఫెస్టోలోని హావిూలు అమలు చేస్తే భారత్ దివాళా తీయడం ఖాయమని ప్రధాని మోదీ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం ముంబయిలో పర్యటించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ముంబయికి నమ్మకద్రోహం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోని మావోయిస్టుతో పోల్చిన ఆయన.. దాన్ని అమలు చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పతానావస్థకు చేరుతుందని చివరకు భారత్ దివాళా తీస్తుందని విమర్శించారు. మనుగడే కష్టంగా మారిన కాంగ్రెస్ ఇష్టానుసారంగా హావిూలు ఇస్తోంది. దేవాలయాల్లో బంగారం, మహిళల మెడలో మంగళసూత్రాలపై ఆ పార్టీ కన్ను పడిరది. 50 శాతం వారసత్వ పన్ను విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది.
ప్రజల ఆస్తిని ఎక్స్ రే తీసి, ఓట్ జిహాద్ గురించి మాట్లాడే వారి ఓటు బ్యాంకుకు అప్పగిస్తోంది. పది సంవత్సరాల పాలనాకాలానికి సంబంధించిన రిపోర్ట్ కార్డు, 25
సంవత్సరాల దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం నా వద్ద ఉన్న ప్రణాళికలు ఒక వైపు, పదుల సంఖ్యలో ప్రధాని అభ్యర్థులు ఉన్న ఇండియా కూటమి మరో వైపు నిలబడ్డాం. ప్రజలు ఎటు వైపు ఉండాలో ఇప్పటికే తేల్చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దైనా అతి కష్టంతో కూడుకున్న పనులు. వాటిని మా హయాంలో పూర్తి చేయగలిగాం. ఇవన్ని విూ విలువైన ఓటుని సరైన నాయకత్వానికి అప్పగించడం వల్లే అయ్యాయి. మరోసారి బీజేపీ సర్కార్‌ని ఆశీర్వదించండని ప్రధాని మోదీ ఓటర్లను కోరారు.