20-05-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, మే 20: దేశవ్యాప్తంగా 5వ దశ లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమయ్యింది. ఆరు రాష్టాల్రు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుత బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ అమేథీ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె అమేథీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు తన గ్రామం గౌరీగంజ్‌లో వికసిత్ భారత్ సంకల్పంతో తన ఓటు వేయడం జరిగిందన్నారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి.. దేశ భవిష్యత్తుకు బాధ్యతగా ఓటు వేయమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఉత్తరప్రదేశ్ లో కూడా పలు స్థానాలకు పోలింగ్ పక్రియ ప్రారంభమైంది. మాజీ సిఎం, బిఎస్పి అధినేత్రి మాయావతి లక్నోలోని పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేశారు.
అనంతరం సిరా వేలును చూపి అందరినీ ఓటు వేయమని సందేశం ఇచ్చారు. ముంబై నార్త్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పీయూష్ గోయల్ బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుని ముంబై ప్రజలు దేశానికి మంచి భవిష్యత్తు కోసం ఓటు వేస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత సిరా వేసిన వేలిని కూడా చూపించారు. ఉత్తరప్రదేశ్లో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలబడి ఓటు వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఐదవ దశ పోలింగ్ సందర్భంగా నటి సన్యా మల్హోత్రా ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈమెతో పాటు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కూడా ముంబైలో ఓటు వేశారు. అలాగే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా తన ఓటు హక్కును ముంబై నగరంలో వినియోగించుకున్నారు. పౌరసత్వం వచ్చిన తరువాత తాను వేసిన తొలిఓటుగా పేర్కొన్నారు. నటి జాన్వీ తదితరులు కూడా ఓటేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.