20-05-2024 RJ
జాతీయం
బెంగళూరు, మే 20: బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్‌లో బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేశారు. దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే పార్టీకి వచ్చిన ఓ కారులో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధించిన స్టిక్కర్ దొరికింది. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ పరిసరాల్లో జాగ్వార్, బెంజ్ సహా ఖరీదైన 15 ఖరీదైన కార్లను జప్తు చేశారు. ఐదుగురిని అరెస్టు చేసిన ఎలక్టాన్రిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ రేవ్ పార్టీలో లిక్కర్ తో పాటుగా పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా లభ్యం అయ్యాయి. జీఆర్ ఫామ్‌హౌస్ అనేది హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యక్తికి చెందినది తేల్చారు. ఈ పార్టీలో తెలుగు రాష్టాల్రకు చెందిన వారు కూడా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. టీవీ నటులు సహా, మోడల్స్, పలువురు వ్యాపార, రాజకీయ వారసులు కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నట్లుగా చెబుతున్నారు. సీసీబీ సోదాల్లో ఎండీఎంఏ సహా పలు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. జాగ్వార్ లాంటి ఖరీదైన కార్లతో పాటు మొత్తం ఐదుగురిని సీసీబీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలో బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలుగు సినీనటి హేమ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆమె ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ’నేను ఎక్కడకు వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నాను.. ఇక్కడ ఫామ్‌హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నాను. నాపై వస్తోన్న వార్తలను నమ్మకండి. అవి ఫేక్ న్యూస్. అక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలియదు. దయచేసి మీడియాలో నాపై వచ్చే వార్తలను నమ్మకండి’ అని విజ్ఞప్తి చేశారు.