21-05-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, మే 21: ఆప్ నేతలు తన వ్యక్తిగత వివరాలను సోషల్ విూడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. దీని వల్ల తన కుటుంబానికి ప్రమాదముందన్నారు. తనపై జరిగిన దాడి విషయంలో విచారణ జరుగుతున్న సమయంలో ఆప్ నేతలు తన వ్యక్తిగత వివరాలైన వాహన నెంబర్లు మొదలైన వాటిని లీక్ చేయడాన్ని ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా మాట్లాడుతూ తాను అవినీతికి పాల్పడినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ఢిల్లీ మంత్రులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. భాజపా సూచనల మేరకే చేశానని పుకార్లు సృష్టిస్తున్నారు.
2016లో నావిూద నమోదైన కేసుకు వ్యతిరేకంగా న్యాయబద్దంగా పోరాటం చేశాను. కోర్టు అది తప్పుడు కేసును కొట్టేసింది. ఆ సమయంలో ఆప్ నేతలు నన్ను లేడీ సింగం అని పొగిడారు. వారికి నేనిప్పుడు భాజపా ఏజెంట్‌గా కనిపిస్తున్నానా? అని ఆప్ వర్గాలను నిలదీశారు. ఢిల్లీ మంత్రులు అధికార మత్తులో ఉన్నారని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందన్నారు. వారు చెప్పే ప్రతి అబద్దానికి కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. నిజం మాట్లాడినందుకు పార్టీ మొత్తం తనపై ట్రోల్ చేస్తోందన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరినీ పిలిచి తన వ్యక్తిగత వీడియోలు ఉంటే పంపమని చెబుతూ, వాటిని లీక్ చేస్తున్నారని విమర్శించారు.