21-05-2024 RJ
జాతీయం
పాట్నా, మే 21: అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, టుక్డే టుక్డే గ్యాంగ్‌పై జూన్ 4న కీలక నిర్ణయం రాబోతోందని ప్రధాని మోదీ అన్నారు. ఇంతవరకూ జరిగిన ఐదు విడతల పోలింగ్‌లో ’ఇండి’ కూటమి పూర్తిగా ఓటమిపాలైందన్నారు. ఇండియా కూటమి పాపాలతో 21వ శతాబ్దపు భారతదేశం పురోగమించ లేదని, ఆ కారణంగానే ప్రతి ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్, ఆర్జేడీ వంటి పార్టీలకు గట్టి గుణపాఠం చెబుతున్నారని అన్నారు. విపక్ష పార్టీల సారథ్యంలోని ’ఇండియా’ కూటమిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. 21వ శతాబ్దపు భారతదేశాన్ని ’ఇండి’ కూటమి పాపాలు ముందుకు తీసుకువెళ్లలేవని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల ఆరో విడత ప్రచారంలో భాగంగా బీహార్ లోని ఈస్ట్ చంపరాన్‌లో మంగళవారంనాడు జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ, కాంగ్రెస్, దాని భాగస్వామ్య పార్టీలు దేశాన్ని 60 ఏళ్ల పాటు ధ్వంసం చేశాయని, మూడు, నాలుగు తరాల జీవితాలను నాశనం చేశాయని మోదీ విమర్శించారు. 60 ఏళ్లలో ఈ వ్యక్తులు భారీ ప్యాలెస్‌లు నిర్మించుకున్నారు. స్విస్ అకౌంట్లు తెరిచారు. విూ పిల్లలకు చదువుకునేందుకు స్కూళ్లులేవు. వారి పిల్లలు మాత్రం విదేశాల్లో చదువులు కొనసాగించారు. పేదల కష్టాల పాలయ్యారని అన్నారు.
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌పై ప్రధానమంత్రి మోదీ పరోక్ష విమర్శలు చేస్తూ, జూన్ 4 తర్వాత మోదీ బెడ్ రెస్ట్ తీసుకుంటారని ఇక్కడ ఒకరు అన్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే దేశంలోని ఏ ఒక్కరూ తమ జీవితంలో బెడ్ రెస్ట్ తీసుకోకూడదని తాను భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. దేశ ప్రజలంతా పూర్తి శక్తిసామర్థ్యాలతో ఉండాలని కోరుకుంటు న్నానని అన్నారు. జంగిల్ రాజ్ వారసుల నుంచి ఇంతకంటే ఏమి ఆశిస్తాం. మోదీని ఆడిపోసుకోవడం మినహా ఈ ఎన్నికల్లో వాళ్లు మాట్లాడేందుకు ఎలాంటి అంశాలు లేవని మోదీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఏడు విడతల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరో విడత పోలింగ్ జూన్ 25న జరుగనుంది.