24-05-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, మే 24: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం ఎవరెస్ట్ చెత్తకుప్పగా మారుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. పర్యాటకులకు తోడు, పర్వతారోహకులు వదిలేస్తున్న చెత్త కారణంగా పర్వత శ్రేణులు కాలుష్యం బారిన పడుతున్నాయి. ఇది మనకు తీరని నష్టం చేస్తుందని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీనినుంచి గుణపాటం నేర్చుకోవాల న్నారు. ప్లాస్టిక్ సహా వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటోందన్నారు. మరో ముఖ్యంగా 8,848 విూటర్ల ఎత్తు ఉండే ఎవరెస్ట్ శిఖరంపై టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోతున్నది. ఎవరెస్ట్ అధిరోహణకు ఏటా వేలా మంది పర్వతారోహకులు వెళ్తుంటారు. వీరంతా వాడి పడేసే వస్తువులు, ఇతరత్రా వాటి వల్ల ఎవరెస్టు పర్వతం ప్రపంచంలోనే ఎత్తయిన వ్యర్థ పదార్థాల డంపింగ్‌గా మారుతున్నది.
గత కొన్నేండ్ల కార్యకలాపాల వల్ల పర్వతంపై 50 టన్నుల మేర చెత్త మిగిలి ఉండే అవకాశం ఉన్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎవరెస్టు బేస్ క్యాంపు వద్ద ప్రతి సీజన్‌లో 75 టన్నుల వ్యర్థాలను తొలగిస్తుంటారు. ఇంకా పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడం, దాన్ని తొలగించడం ప్రతి ఏడాది ఒక నిరంతర పక్రియగా మారింది. ఇది అత్యంత దారుణమైన నిజమని పురుషోత్తం రెడ్డి అన్నారు. ఇలాంటి వాటిని ఎలా నిర్మూలించుకోగలమో ఆలోచన చేయాలన్నారు. ఎవరెస్టు పర్వతం, దాని సవిూపంలోని సాగరమాత నేషనల్ పార్క్‌కు ఏటా వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. 2014, 2017 మధ్య ఈ సంఖ్య రెట్టింపు అయింది. ప్రస్తుతం ప్రతి ఏడాది 60 వేల మంది వరకు విదేశీ పర్యాటకులు పార్కుకు వస్తున్నారు. వీరికి అదనంగా వేలాది నేపాలీ గైడ్స్ ఉంటుంటారు.
వీరు ప్రతి ఏడాది 1,000 టన్నుల వ్యర్థాలను వదిలి వెళ్తారని ఒక అంచనా. అయితే ఇందులో చాలా వరకు పార్కులోనే ఉండిపోతున్నది. ప్రధానంగా పర్వతారోహణను ప్రారంభించే ఎవరెస్టు బేస్ క్యాంపు వద్ద అధికంగా వ్యర్థాలు పడి ఉంటున్నాయి. క్యాంపుల వద్ద ఉండే చెత్తను చాలా వరకు శుభ్రం చేస్తున్నప్పటికీ, పర్వతంపై ఉండే వ్యర్థాల మొత్తాన్ని క్లీన్ చేయడం సాధ్యపడటం లేదు. ఎందుకంటే అంత ఎత్తుకు వెళ్లి వాటిని సేకరించి మళ్లీ కిందకు తీసుకుని రావడం సాధ్యమయ్యే పనిగా లేదు. ఎవరెస్టుపై అత్యంత కాలుష్య ప్రాంతంగా నాల్గవ క్యాంపు ఉన్నది. ఇది పర్వతారోహకులు చివరగా ఆగే స్థలం. సముద్ర మట్టానికి 7,900 విూటర్ల ఎత్తులో ఉండే, డెత్ జోన్‌గా పిలిచే ఈ ప్రాంతం నుంచి వ్యర్థాలను తీసుకురావడం అంత సులభం కాదని ది ఎవరెస్టు ప్రాజెక్టు సీఈవో కౌఫ్‌మాన్ పేర్కొన్నారు.
ఈ సైట్ వద్ద పర్వతారోహకులు కొంత సేపు మాత్రమే ఆగుతారు. తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉండే నేపథ్యంలో కిందకు దిగి వచ్చే సమయంలో చాలా త్వరగా వచ్చేస్తారు. ఈ క్రమంలో తమకు సంబంధించిన టెంట్లు, ఆక్సిజన బాటిళ్లు, స్టీల్ గిన్నెలు, స్పూన్లు వంటివి అక్కడే వదిలేస్తారు. వ్యర్థాల నిర్వహణను సాగరమాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(ఎస్‌పీసీసీ) చేపడుతున్నది. 2014 నుంచి ఎవరెస్టు బేస్ క్యాంపును దాటి వెళ్లిన వారు తిరిగి 8 కేజీల వ్యర్థాలను తమ వెంట కిందకు తీసుకురావాలనే నిబంధన పెట్టారు. లేకుంటే 4 వేల డాలర్లు(రూ.3.3 లక్షలు) డిపాజిట్‌ను కోల్పోవాల్సి ఉంటుంది. వ్యర్థాల నిర్వహణకు ఎస్‌పీసీసీ ఎంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, సమస్య పూర్తిగా పరిష్కారం అవుతున్నట్టు కనిపించడం లేదు.
మరోవైపు ఎవరెస్టుపై చెత్తను తొలగించడంలో నేపాల్ సైన్యం కూడా సహకారం అందిస్తున్నది. 2022లో ఎవరెస్టు, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 34 టన్నుల వ్యర్థాలను తొలగించామని ఆర్మీ పేర్కొన్నది. ఈ క్రమంలో నిబంధనలు కఠినతరం చేయాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అన్నారు.