25-05-2024 RJ
జాతీయం
భారతదేశ జనాభా అధికారికంగా 140కోట్లు.. అప్పనంగా వచ్చి చేరిన వారు, లెక్కలు సరిగా కట్టకపోవడం కలిపితే ఇంకో ఐదారు కోట్లు చేరుతుంది. ఇంతమంది జనాభాకు ఎన్ని తిండిగింజలు అవసరం అవుతాయి.. ఎన్ని రకాల పప్పుధాన్యాలు, నూనెలు ఎంత అవసరమో అన్నది ముఖ్యం. అలాగే వీరందరికీ గూడు కూడా ముఖ్యమే. కానీ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా జనాభాకు తగ్గట్లుగా ప్రణాళికలు వేయడం లేదు. అలాగే ఈ మానవులను ఉపయోగించి అద్భుతాలు సృష్టించవచ్చని కూడా ఆలోచించడం లేదు. కేవలం కొందరిని గుర్తించి వారికి వండివార్చడమెలా అన్నదే ఆలోచిస్తున్నారు. అలా వండివార్చడం వెనకా పరామర్థం ఉంది. వారంతా ఓటు వేస్తారన్న నమ్మకంతో ఇలాంటి వంటావార్పులు అంటే..పథకాల పేరుతో పందేరాలు చేస్తున్నారు. అంతేగానీ మానవవనరులను ఉపయోగించి దేశానికి ఎలా పునాదులు వేయాలో అన్న ఆలోచనలు నేతల్లో కానరావడం లేదు. ఐదేళ్ల పదవీకాలం కోసం పోరాటం.. ఆ తరవాత మరో ఐదేళ్లకు ప్రణాళికలతో భారత ఎన్నికల తంతు సాగుతోంది. అందుకే మనదేశంలో చదువుకున్న వారికి ఉద్యోగాలు రావడం లేదు. చదువుకోలేని వారికి ఉపాధి దక్కడం లేదు. ఉచితాలు పొదేవారు హాయిగా ఉంటున్నారు. ఇలాంటి చర్యల కారణంగా దేశం ఏటేటా అప్పుల ఊబిలో కూరుకుపోయి, అడుగులు ముందుకు వేయడం లేదు. చైనాతో పోలిస్తే..మానవ వనరుల వినయోగంలో భారత్ ఎప్పుడూ వెనకబడే ఉంటోంది.
మానవ వనరుల వినయోగానికి సంబంధించి సరైన ప్రణాళికలు ప్రభుత్వం వద్ద లేవు. దేశంలో ఉన్న సహజ వనరులతో పాటు మనావ వనరులను జోడిరచాలన్న ఆలోచన ఏ ప్రభుత్వానికి కూడా లేకుండా పోయింది. ద్రవ్యోల్బణం,ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం, అంతర్జాతీయంగా భౌగోళికంగా, రాజకీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు వంటి సమస్యలున్నా భారత్ తన జనాభాను ముఖ్యంగా యువతను సరైన విధంగా వినియోగించుకుంటే అద్భుతమైన ప్రగతిని నమోదు చేయవచ్చు. అంతర్జాతీయ సంస్థలు, నిపుణులు కూడా దీనిని విశ్లేషిస్తున్నారు. అయితే ఉపయోగం మాట అలా వుంచితే జీవన పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. మనదేశంలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంటున్నది. ప్రభుత్వపరంగా ఎదురవుతున్న వివక్ష, నిర్లక్ష్యం వల్ల కూడా పెద్ద సంఖ్యలో అవిద్య, ఆకలిదప్పులకు లోనవుతున్నారు. పెరిగిపోతున్న వృద్ధ జనాభాకు అవసరమైన వైద్య చికిత్సలను అందించటం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పలు ధనిక దేశాల్లో ఇప్పుడు ఈ సమస్య ఉన్నది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకైతే ఈ వ్యయాన్ని భరించటం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. దీంతో మన దేశంలో జనాభా వృద్ది తప్ప అభివృద్ది కానరావడం లేదు. నేటికి ఆకలి దప్పులు, అనారోగ్యం తప్పడం లేదు.
రాజకీయ వ్యవస్థ మాత్రమే బాగు పడుతోంది. తమకు అనుకూలంగా చట్టాలు చేసుకోవడం, అవసర మైతే తుంగలో తొక్కడం అన్న చందంగా మన వ్యవస్థ సాగుతోంది. భారతదేశ జనాభాలో సగం మంది 30 ఏండ్లలోపు వారే అని గణాంకాలు చెబుతున్నాయి. అంటే, దాదాపు 72 కోట్ల మందితో కూడిన యువశక్తి ఉన్న దేశం మనది. ప్రపంచంలో ఏ దేశం వద్దా ఇంతటి యువశక్తి లేదు. సరైన విద్యను అందించటం ద్వారా, ఉద్యోగ నైపుణ్యాల కు సంబంధించి నిరంతర శిక్షణ ఇవ్వటం ద్వారా యువశక్తి ప్రతిభ సామర్థ్యాలను దేశం ఉపయోగించు కోవచ్చు. అందుకు మనదగ్గర సహజవనరులకు కూడా కొదువ లేదు. భూమి,నీరు పుష్కలం గా ఉన్నాయి. వీటిని వినియోగించుకుంటే దేశం ఎంతగానో పురోగ మిస్తుంది. చైనాను అధిగమించి భూగోళం విూద అత్యధిక జనాభా రికార్డు సృష్టించామని చెప్పుకునే ముందు దానితోపాటు వచ్చే సమస్యల పైనా దృష్టిపెట్టాలి. ఆ సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళి కలు అవసరమవుతాయి. ప్రజలకు నాణ్యతతో
కూడిన జీవనాన్ని ఇవ్వటానికి అవసరమైన ధృఢమైన నిర్ణయాలు, మెరుగైన విద్య, వైద్యం, నైపుణ్యాలు, ఉద్యోగాలు అవసరమవుతాయి. వీటన్నింటిపై ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తుల స్థాయిలో సమగ్రమైన కార్యాచరణ జరుగాలి. అయితే అధిక జనాభా ఉండటం కూడా సమస్యే తప్ప మరోటి కాదు. దానితో ఉండే సమస్యలు దానికున్నాయి.
జనాభాను దేశానికి పరిమితమైన అంశంగా కాక, అంతర్జాతీయంగా ప్రభావం చూపే అంశంగా గుర్తించాలి. జనాభాకు తగ్గట్టుగా ఆహారధాన్యాలు, ఆవాసాలు, గాలి,నీరు అవసరం కూడా. ముఖ్యంగా వాతావరణ మార్పులు కీలకమైనవి. భూవ్మిూద జీవ వైవిధ్యానికి ఎదురవుతున్న సవాళ్లపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ప్రతికూల వాతావరణ మార్పుల వల్ల ప్రజల వలసలు రానున్న రోజుల్లో విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉన్నదని ఈ సంస్థ చెప్తున్నది. అధిక జనాభా వల్ల నివాసయోగ్యమైన ప్రాంతాలు కుదించుకు పోతున్నాయి. దీవులు, తీరప్రాంతాలు మునిగిపోతున్నాయి. మనుగడ కోసం వన్యప్రాణులకు, మనుషులకు మధ్య ఘర్షణ పెరిగే ప్రమాదం ఏర్పడుతున్నది. అడవుల నరికివేత, కొండలు, గుట్టులు కొట్టేయడం వల్ల పర్యావరణ సమతులతులత్య దెబ్బతింటోంది. మంచి నీళ్లు, గాలి తగ్గుతున్నాయి. ఇవన్నీ ఏవో కాకిలెక్కలు కావు. ప్రపంచ వ్యాప్తంగా తరచూ వెలువడుతున్న పరిశోధనల నివేదికలు, అధ్యయనాలు చేస్తున్న హెచ్చరికలు. అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ వీటిని విస్మరించ రాదు. కచ్చితంగా వీటిపై అధ్యయనం జరిపి, తక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఏ విషయం లోనూ జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అధికా జనాభా విస్ఫోటనంలో మనం ముదున్నాం. చైనాను అధిగమించాం. దీనిని కట్టడి చేసకోవాల్సి ఉంది. జనాభా నియంత్రణ అన్నది యుద్దప్రాతిపదికన సాగాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్థిక వృద్ధి రేటు దాదాపు ఆరు శాతంగా నమోదవుతున్నది. మార్పుల కారణంగా కావచ్చు..ఆహార లభ్యత కావచ్చు..ఉన్నత జీవన ప్రమాణాలు కావచ్చు.. గత శతాబ్ద కాలంలో ఔషధ రంగంలో చోటుచేసుకుంటున్న అత్యాధునిక మార్పుల వల్ల కావచ్చు..మానవ జీవితకాలం దాదాపు రెట్టింపయ్యింది.
2019లో దేశ జనాభాలో అరవై ఏండ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న వారు పది శాతమే. కానీ, 2050 నాటికి వారి సంఖ్య 19.6 శాతానికి పెరుగుతుంది. అంటే, మరో 25 ఏండ్లపాటు మన వద్ద తిరుగులేని యువశక్తి ఉన్నప్పటికీ, వృద్ధుల సంఖ్య కూడా తక్కువేవిూ ఉండదు. వీరి సంఖ్య దాదాపు 30 కోట్లకు చేరుకుంటుంది. వీరందరికీ మంచి జీవనాన్ని కల్పించటం సవాల్ లాంటిదే. ఇకపోతే తాజా అంచనాల ప్రకారం ఆయుః ప్రమాణం మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. తరచూ ఏదో ఒక చికిత్స తీసుకునే వృద్ధ జనాభాతోనే తమకు ఎక్కువ లాభం కాబట్టి, మానవ ఆయుః ప్రమాణం పెరుగుదల లో ఔషధరంగం పాత్ర కూడా లేకపోలేదన్న వాదనలున్నాయి. పెరుగుతున్న జనాభా వల్ల భూమి, అడవులు, జల వనరులు, గాలి వంటి సహజ వనరులపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. ఇప్పటికే పర్యావరణ సమస్య తీవ్రంగా ఉంది. ఇవన్నీ ప్రభుత్వాలు తీవ్రంగా అధ్యయనం చేయాల్సిన అంశాలు. అప్పుడే మన సమస్యలను మనం పరిష్కరించుకోగలమని పాలకులు గుర్తించి నడుచుకోవాలి.