25-05-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, మే 25: లోక్‌సభ ఎన్నికలకు ఆరో విడత పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో ఓ టర్లు మెల్లగా క్యూలకు చేరారు. దీంతో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. దేశంలోని 6 రాష్టాల్రు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ చేపట్టారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 5 గంటల వరకు కొనసాగనుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఉదయం పోలింగ్ ప్రారంభానికి ముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలి గంటల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించు కున్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చాలని ఆమె పిలుపునిచ్చారు.దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ఆయన భార్య సుదేశ్ క్యూలైన్‌లో నిల్చుని ఓటు వేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తొలి పురుషుడు ఈయనే కావడంతో అధికారులు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ విషయాన్ని ఆయన ఎక్స్‌లో పంచుకుంటూ తన సర్టిఫికెట్ చూపించారు. తూర్పు ఢిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, బిజెపి లోక్‌సభ అభ్యర్థి బన్సూరీ స్వరాజ్, ఆమె తండ్రి కౌశల్ స్వరాజ్, కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ దంపతులు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కుటుంబం, ఢిల్లీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, ఆతిశీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ, మాజీ సీఈసీ సుశీల్ చంద్ర తదితరులు తొలి గంటల్లో ఓటేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ తన భార్య సుదేశ్ ధన్‌ఖర్‌తో కలిసి ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కూడా ఓటువేశారు.
ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ, ప్రియాంక పిల్లలు రైహాన్ రాజీవ్ వాద్రా, మిరయా వాద్రా, ఢిల్లీ మంత్రులు అతిశీ, సౌరభ్ భరద్వాజ్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీలో ఓటు వేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో తెలంగాణ ఇంచార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తన ఓటు హక్కును వినియోగించు కున్నారు. గవర్నర్ రాధాకృష్ణన్ క్యూలైన్‌లో వచ్చి ఓటు వేశారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ.. ఇవాళ తాను ఓటు వేసి ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నాను. ప్రతి పౌరుడు కూడా విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఓటు వేయడం ఒక హక్కు మాత్రమే కాదు, దేశానికి ప్రజాస్వామ్య కర్తవ్యం కూడా అని రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
జార్ఖండ్‌లోని 4 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆరో విడతలో 6 రాష్టాల్రు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఆరో విడతలో ఉదయం 9 గం. వరకు 10.82 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ ముగిసిపోగా ఇప్పుడు ఆరో విడత పోలింగ్ జరుగుతోంది. జూన్ 1న జరిగే చివరి విడతతో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పక్రియ ముగియనుంది. జూన్ 4న ఒకేసారి ఓట్లను లెక్కించి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఆరో విడత పోలింగ్ జరగనున్న రాష్ట్రాల జాబితాలో బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా రాష్టాల్రు ఉన్నాయి. బీహార్‌లో 8, హరియాణాలో 10, జమ్ముకశ్మీర్లో 1, జార్ఖండ్‌లో 4, ఢిల్లీలో 7, ఒడిశాలో 6, యూపీలో 14, బెంగాల్లో 8 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.
జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్‌లో మూడో విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉండగా వాయిదా పడిరది. ఆరో విడతలో ఆ లోక్‌సభ స్థానానికి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆరో విడతలో వివిధ పార్టీల నుంచి కీలక అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. ఢిల్లీలో 7 లోక్‌సభ స్థానాలకు ఆరో విడత ఎన్నికల్లోనే పోలింగ్ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసు, స్వాతి మాలివాల్‌పై దాడి లాంటి పరిణామాలు అక్కడి రాజకీయాలను వేడెక్కించాయి. దాంతో ఆరో విడత లోక్‌సభ ఎన్నికలపై ఎప్పుడూ లేనంతగా ఉత్కంఠ నెలకొంది. న్యూఢిల్లీ నుంచి కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఆమె ఆప్ అభ్యర్థి సోమ్‌నాథ్ భారతితో తలపడనున్నారు. ఈశాన్య ఢిల్లీలో ఈసారి టఫ్ ఫైట్ కనిపించేలా ఉంది. కాంగ్రెస్ తరపున కన్హయ్య కుమార్ బరిలోకి దిగగా, బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ పోటీ చేస్తున్నారు.
యూపీలోని సుల్తాన్‌పూర్‌లో బీజేపీ తరపున మేనకాగాంధీ బరిలోకి దిగారు. సమాజ్‌వాది పార్టీ నుంచి రామ్ బువల్ నిషద్ బరిలో ఉన్నారు. ఇక యూపీలోనే మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోదరుడు ధర్మేంద్ర యాదవ్ ఆజాంగఢ్ నుంచి బరిలోకి దిగారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచే బరిలోకి దిగిన అఖిలేష్ యాదవ్ విజయం సాధించారు. ఈ సారి కూడా తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడన్న నమ్మకంతో ఉన్నారు. ఒడిశాలోని పూరి నియోజకవర్గంలో బీజేపీ తరపున సంబిత్ పాత్ర పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేడీ తరపున అరుప్ పట్నాయక్, కాంగ్రెస్ నుంచి జయ్ నారాయణ్ పట్నాయక్ బరిలో ఉన్నారు. హర్యానాలోని కురుక్షేత్రలో బీజేపీ తరపున నవీన్ జిందాల్ బరిలో ఉన్నారు. కర్నాల్ నియోజకవర్గం నుంచి హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పోటీ చేస్తున్నారు. గుడ్గావ్‌లో కాంగ్రెస్ తరపున రాజ్ బబ్బర్.. బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఇంద్రజిత్ సింగ్‌తో తలపడుతున్నారు. ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా లోక్‌సభ ఆరో విడత ఎన్నికలతోపాటే పోలింగ్ జరుగుతోంది.