25-05-2024 RJ
జాతీయం
బెంగళూరు, మే 25: రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు వాసు ముఖ్య అనుచరుడు, ఈ కేసులో ఏ2గా ఉన్న అరుణ్ కుమార్‌ను బెంగళూరు కైర్ర బ్యాచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ ఈ రేవ్ పార్టీలో ఏ2గా ఉన్నాడు. బర్త్ డే పార్టీ నిర్వహించిన వాసుకు అరుణ్ ముఖ్య అనుచరుడు. కాగా, అరుణ్ కుమార్ బెంగళూరులో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అలాగే, రేవ్ పార్టీలకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, అరుణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఇదిలా ఉండగా బెంగళూరులోని బీఆర్ ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి కూడా సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం విచారణకు రావాలని ఆదేశించారు. రేవ్ పార్టీపై పోలీసులు ఆకస్మిక దాడి చేసిన సమయంలో అక్కడ నుంచి పారిపోయిన పూర్ణారెడ్డి అనే వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. బెంగళూరు రేవ్ పార్టీకి వచ్చిన వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో టాలీవుడ్ నటి హేమా, ఆషీరాయ్ కూడా ఉన్నారు. వీరి బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు ఆనవాళ్లను గుర్తించిన సంగతి విదితమే. మిగతా వారి పేర్లను కూడా పోలీసులు ప్రకటించాల్సి ఉంది
నటి హేమకు బెంగళూరు పోలీసుల నోటీసులు
సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశాలు
ఈ ఘటనపై మొత్తం 8 మందికి ఒకేసారి సీసీబీ పోలీసులు నోటీసులు జారీచేయడం జరిగింది. ఇందులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నారు. రక్త నమూనాలలో డ్రగ్స్ తీసుకున్నారని తేలిన వారికి సీసీబీ నోటీసులు జారీచేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు బెంగళూరు పోలీసుల ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో సీసీబీ స్పష్టంగా పేర్కొన్నది. కాగా.. రేవ్ పార్టీలో పట్టుబడిన 101 మంది బ్లడ్ శాంపిల్స్ పరీక్షలు చేయగా.. 86 మందికి రక్త నమూనాలలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. ఇందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. పార్టీలో ఉన్న 30 మందిలో 27 మంది మహిళలు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ కావడం గమనార్హం. డ్రగ్స్ తీసుకున్న వారందరికీ సీసీబీ పోలీసులు నోటీసులు పంపుతున్నారు.
పాజిటివ్ వచ్చిన వారందరికీ విడతల వారీగా నోటీసులు ఇవ్వడం జరుగుతోంది. తొలి విడతలో 8 మందికి బెంగళూరు సీసీబీ నోటీసులు జారీ చేసింది. రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో నటి హేమతో పాటు ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసుతో పాటు పలువురు ఉన్నారు. అబ్బే.. తాను రేవ్ పార్టీలోకి పోలేదని హైదరాబాద్ ఫామ్‌హౌస్‌లోని ఓ వీడియో.. ఆ మరుసటి రోజు పచ్చడి చేస్తున్నట్లు మరో వీడియో రిలీజ్ చేసింది హేమ. హేమ ఫొటోను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేయడం సీన్ మొత్తం రివర్సయ్యింది. కృష్ణవేణి పేరుతో నటి హేమ పార్టీకి హాజరైంది. పోలీసు రికార్డుల్లోనూ హేమ పేరు కృష్ణవేణిగా నమోదు చేయడం జరిగింది. అయితే.. హేమను బాధితురాలిగా పరిగణించే అవకాశం ఉందని తెలుస్తోంది.