27-05-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, మే 27: విభజన సందర్భంగా ఏపీలోనూ.. ఎన్‌డిఎ పాలన ఏర్పాటుకి ఒనగూర్చే ప్రయోజనాల విషయంలో కేంద్రం ఓ రకంగా చేతులు ఎత్తేసిందనే చెప్పాలి. కానీ చాలానే చేశామని బిజెపి ప్రకటించుకుంది. పైగా విశాఖ ఉక్కును తెగనమ్మే ప్రయత్నం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే బిజెపి వైఫల్యాలు అనేకం. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నా ఒక్కటంటే ఒక్క మేలు చేయలేదు. అయినా ఏపీలో గణనీయంగా సీట్లు గెల్చుకోబోతన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వచ్చేది ఎన్డీయే సర్కారేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని సంపూర్ణ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో తాము దాదాపు 17 లోక్‌సభ స్థానాలను గెల్చుకుంటామనీ విశ్వాసం వ్యక్తం చేశారు. సార్వత్రిక సమరంలో దేశవ్యాప్తంగా 400కుపైగా సీట్లు సాధిస్తామన్నారు. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సమయం వచ్చేసిందని షా అన్నారు. వాటితో ఎన్నికల వ్యయం దిగివస్తుందని పేర్కొన్నారు. మండే ఎండల్లో కాకుండా, మరేదైనా సమయంలో సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడంపై కూడా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.
ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్‌లలోనూ ఈ దఫా కమలదళం ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తుందని జోస్యం చెప్పారు. ఓ ప్రముఖ వార్తాసంస్థతో ఆయన పలు అంశాలపై మాట్లాడుతూ ఎపిలో ఎన్‌డిఎ అధికారంలోకి వస్తుతందని అన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చాక.. ఐదేళ్ల కాలంలో విస్తృత సంప్రదింపుల అనంతరం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తాము అమలు చేయనున్నట్లు షా చెప్పారు. భాజపా అధికారంలో ఉన్న రాష్టాల్లోన్రే కాకుండా, విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ ఈ దఫా తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని షా ధీమాగా పేర్కొన్నారు. 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో కమలదళం 75 స్థానాలు గెల్చుకుంటుందని అంచనా వేశారు. ఆ రాష్ట్రంలో 16-17 ఎంపీ సీట్లను తమ ఖాతాలో వేసుకుంటామని జోస్యం చెప్పారు. ఆంధప్రదేశ్‌లో 17, పశ్చిమ బెంగాల్‌లో 24-32 లోక్‌సభ స్థానాలు ఎన్డీయేకు దక్కుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. యూసీసీని అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యతను రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటు, రాష్టా శాసనసభల భుజస్కంధాలపై ఉంచారని షా పేర్కొన్నారు. రాజ్యాంగ పరిషత్ నిర్దేశిరచిన మూలసూత్రాల్లో యూసీసీ కూడా ఉందని చెప్పారు. తమ సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చాక.. అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి వచ్చే ఐదేళ్లలో దాన్ని అమల్లోకి తీసుకొస్తుందని స్పష్టం చేశారు. సాయుధ బలగాల్లో నియామకం కోసం మోదీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటాన్ని షా తప్పుబట్టారు.
అగ్నిపథ్ కంటే ఆకర్షణీయ పథకం యువతకు ఇంకొకటి ఉండదన్నారు. నాలుగేళ్ల సర్వీసు అనంతరం పదవీవిరమణ పొందే అగ్నివీర్‌లకు రిజర్వేషన్ కారణంగా కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో ఉద్యోగావకాశాలు 7.5 రెట్లు అధికంగా ఉంటాయని తెలిపారు. అగ్నిపథ్‌ను సరిగా అర్థం చేసుకోకుండా.. దాన్ని రద్దు చేస్తామని హావిూ ఇస్తున్న రాహుల్‌గాంధీని చూస్తుంటే జాలేస్తోందన్నారు. ఏకీకృత వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని తీసుకొస్తామంటూ కాంగ్రెస్ హావిూ ఇస్తోందని షా తెలిపారు. ధనవంతులు ఉపయోగించే విలాస వస్తువులపై, పేదలు వాడే సరకులపై ఒకే పన్ను రేటును అమల్లోకి తీసుకురావడం ఎలా సముచితమని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల్లో తామేవిూ మతం ఆధారిత ప్రచారం చేయడం లేదని షా స్పష్టం చేశారు. ఒకవేళ ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం, ఆర్టికల్-370 రద్దును చూపుతూ ఓట్లు అడగడం, యూసీసీని అమలు చేస్తామని చెప్పడం మతం ఆధారిత ప్రచార కార్యకలాపాలే అయితే.. భాజపా అలాంటి ప్రచారం చేసిందని, ఇకముందూ కొనసాగిస్తుందని స్పష్టంచేశారు. ఈవీఎంలు, పోల్ డేటాకు సంబంధించి ఈసీపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటాన్ని షా తప్పుబట్టారు.
భాజపా ఓడిపోయిన తెలంగాణ, కర్నాటక హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనూ ఇప్పుడు అనుసరించిన విధానాలనే ఈసీ అనుసరించిన సంగతిని గుర్తుచేశారు. ఓటమిని ముందుగానే గ్రహించి.. రాహుల్ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే పోలింగ్ విధానంపై కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తుతోందంటూ ఎద్దేవా చేశారు. దేశంలో నక్సలిజం సమస్య అంతమవుతుందని షా ఉద్ఘాటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తప్ప మరెక్కడా మావోయిస్టులు లేరని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఈసారి వేర్పాటువాదులు కూడా అత్యధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని షా అన్నారు. అక్కడ పోలింగ్ ప్రశాంతంగా ముగియడం మోదీ ప్రభుత్వం సాధించిన విధానపరమైన విజయమని పేర్కొన్నారు.