28-05-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, మే 28: ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజీవ్రాల్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తనకు మరో వారం రోజులపాటు మధ్యంతర బెయిల్ గడువు పొడిగించాలని కేజీవ్రాల్ పెట్టుకొన్నఅత్యవసర పిటిషన్‌ను సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది. జస్టిస్ జేకే మహేశ్వరి, కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం.. కేజీవ్రాల్ పిటిషన్‌ను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పిటిషన్‌పై తదుపరి ఆదేశాల కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు పంపుతున్నట్లు వెకేషన్ బెంచ్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం కేసులో మని లాండరింగ్ వ్యవహారంలో సీఎం కేజీవ్రాల్‌ను ఈ ఏడాది మే 21వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన తీహాడ్ జైలుకు తరలించింది.
అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ తరఫున ప్రచారం నిర్వహించు కోవాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో మే 10వ తేదీ కేజీవ్రాల్‌కు కండిషన్లతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ క్రమంలో జూన్ 2వ తేదీన మళ్లీ లొంగిపోవాలని కేజీవ్రాల్‌కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. దీంతో తనకు మరో వారం రోజుల బెయిల్ పొడిగించాలంటూ కేజీవ్రాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ జేకే మహేశ్వరి, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ పై విధంగా స్పందించింది.