28-05-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, మే 28: దేశీయ సూచీలు వరుసగా రెండో రోజూ కూడా నష్టాలనే మూటగట్టుకున్నాయి. రోజంతా ఒడిదుడుకుల్లోనే కదలాడిన సూచీలు మధ్యాహ్నం తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లోనే కదలాడాయి. రిలయన్స్, ఎయిర్‌టెల్ వంటి హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాలు మార్కెట్‌ను దెబ్బతీశాయి చివరకు 220 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ రోజును ముగించింది. సోమవారం ముగింపు (75,390)తో పోల్చితే దాదాపు 150 పాయింట్ల లాభంతో మంగళవారం ప్రారంభమైన సెన్సెక్స్ నష్టాలోకి దిగింది. రోజుంతా లాభనష్టాలు దోబూచులాడాయి.
సెన్సెక్స్ మంగళవారం 75,083-75,585 శ్రేణి మధ్యనే కదలాడిరది. చివరకు 220 పాయింట్ల నష్టంతో 75,170 వద్ద రోజును ముగించింది. ఇక, నిప్టీ కూడా రోజంతా అనిశ్చితిలోని కదలాడిరది. చివరకు 44 పాయింట్ల నష్టంతో 22,888 వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిప్టీ మాత్రం 164 పాయింట్లు కోల్పోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 446 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్‌లో ఏషియన్ పెయింట్స్, విప్రో, హిందుస్థాన్ యూనీలివర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్‌సెర్వ్ తదితర షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఎన్టీపీసీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 83.18 వద్ద ట్రేడ్ అవుతోంది.