28-05-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, మే 28: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్కాం మొత్తం కేసీఆర్‌కు తెలిసే జరిగిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు కోర్టుకు చెప్పడం సంచలనంగా మారింది. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలో కవిత తన టీం సభ్యులను కేసీఆర్‌కు పరిచయం చేశారని.. ఈ సందర్భంగా లిక్కర్ వ్యాపారం గురించి వారి వద్ద నుంచి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఈడీ తెలిపింది. కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో వాదనల సందర్భంగా ఈడీ కేసీఆర్ ప్రస్తావనను తీసుకు వచ్చింది. ఢిల్లీ అధికారిక నివాసంలోనే లిక్కర్ స్కాం భాగస్వాములను కేసీఆర్‌కు పరిచయం చేసిన కవిత. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక నిందితుడుగా ఉన్న గోపీ కుమరన్.. ఈ స్కాంలో కేసీఆర్ పాత్రపై స్పష్టంగా రికార్డు చేశారని ఈడీ తెలిపింది. కేసీఆర్ అధికారిక నివాసంలో జరిగిన భేటీలో మద్యం వ్యాపారంలో వివరాలతో పాటు లంచంగా ఇచ్చిన డబ్బులు.. ఇతర వివరాల గురించి మాట్లాడుకున్నారని ఈడీ స్పష్టం చేసింది. ఈడీ వాదనలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలోనూ సంచలనంగా మారనున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఎప్పుడూ కేసీఆర్ అనే పేరు ప్రస్తావన రాలేదు. ఈ వ్యవహారం అంతా కేసీఆర్‌కు తెలియదనే అనుకున్నారు. కేసు బయటకు వచ్చిన తర్వాత ఓ సందర్భంలో కవితపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని విూడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ కేసు విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ పూర్తిగా కవితకు అండగా నిలిచింది. న్యాయపరమన సాయం అందించింది. మొదట్లో ఈడీ విచారణకు పిలిచినప్పుడు అరెస్ట్ చేయకుండా న్యాయపరమైన అన్ని అవకాశాలను ఊపయోగించుకున్నారు. అన్నీ కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగినప్పటికీ.. ఎప్పుడూ ఆయన పేరు తెర ముందుకు రాలేదు. అనూహ్యంగా ఈడీ .. ఈ స్కాం గురించి మొత్తం ముందే కేసీఆర్‌కు తెలుసని వాదించడం అనూహ్యంగా మారింది. గోపికుమరన్ అనే నిందితుడు... ఎప్పుడో తన వాంగ్మూలంలో స్పష్టంగా రికార్డు చేసి ఉంటే ఇప్పటి వరకూ ఏ దశలోనూ ఆ విషయాన్ని కోర్టులకు చెప్పడం లేదా.. మరో విధంగా బయటకు తెలిసేలా చేయకపోవడం రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.
ఈడీ ఆషామాషీగా కేసీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చి ఉండదని.. ఖచ్చితంగా ఆయనను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని అందుకే కోర్టు ముందు పెట్టారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మార్చి పదిహేనో తేదీన ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. అప్పట్నుంచి జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కేసీఆర్ పేరు బయటకు రావడంతో బీఆర్‌ఎస్‌లోనూ గందరగోళం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది.