28-05-2024 RJ
జాతీయం
కోల్‌కతా, మే 28: తృణమూల్‌కు న్యాయస్థానాలంటే లెక్కలేదని, కోర్టు తీర్పులను ఖాతరు చేయడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్వించారు. పశ్చిమబెంగాల్‌లోని జాదవ్‌పూర్, బారాసత్‌లో మంగళవారంనాడు సుడిగాలి ప్రచారంలో తృణమూల్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కోర్టుల తీర్పులను అమలు చేసేది లేదని టీఎంసీ చెబుతుండటంపై దిగ్భార్రతి వ్యక్తం చేశారు. తమకు అనూకూలంగా తీర్పులు ఇవ్వని న్యాయమూర్తులపై గూండాలను సైతం ఉసిగొలుపుతారా? అని ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్‌లో 2010 నుంచి వివిధ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఓబీసీ స్టాటస్‌ను కోల్‌కతా హైకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. ఈ తీర్పును మమతా బెనర్జీ తప్పుపట్టారు. తీర్పు తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. కోర్టు తీర్పుపై బీజేపీ ప్రభావం కనిపిస్తోందని ఆరోపించారు. 2010 తర్వాత మంజూరు చేసిన ఈబీసీ సర్టిఫికెట్లు చెల్లవంటూ కోల్‌కతా హైకోర్టు తీర్పు ఆమోదయోగ్యం కాదని టీఎంసీ ప్రకటించడం తనకు దిగ్భాంతి కలిగించిందని ఎన్నికల ప్రచార సభలో మోదీ చెప్పారు. తమ మోసాలు, అబద్దాలు బహిర్గతం కావడం టీఎంసీకి ఇష్టం ఉండదని, న్యాయవ్యవస్థ పట్ల, రాజ్యాంగం పట్ల వారికి విశ్వాసం లేదా? అని ప్రశ్నించారు.
తమ మోసాలు బయటపెట్టిన న్యాయమూర్తులపై కూడా గూండాలను ఉసిగొల్పుతారా అనేది తాను తెలుసుకోవాలనుకుంటున్నానని అన్నారు. కేవలం తమ ఓటు బ్యంకును కాపాడుకునేందుకే రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఫ్‌ు సాధువులకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఇటీవల కామెంట్లు చేశారని మోదీ తప్పుపట్టారు. పశ్చిమబెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసేది లేదని మమత చెబుతున్నారని, అయితే సీఏఏ అమలును ఎవరూ ఆపలేరని, చట్టానికి ప్రజల నుంచి అసాధారణమైన మద్దతు ఉందని చెప్పారు. సీఏఏ అనేది ప్రజలకు పౌరసత్వం ఇచ్చే చట్టమే కానీ, ఊడలాక్కునే చట్టం కాదన్నారు. కేవలం ఓటు బ్యాంకు కోసం సీఏఏపై టీఎంసీ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడుతోందని వివరించారు.
ఇకపోతే అవినీతిరహిత పాలన అందిస్తున్నందుకు ప్రతిపక్ష నేతలు తనపై కోపం పెంచుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో మళ్లీ అవినీతి రాజ్యం తెచ్చేందుకు తనను ప్రధాని పదవి నుంచి దింపేయాలని కుట్రలు పన్నుతున్నట్లు మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం జార్ఖండ్‌లోని దుమ్కాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. జార్ఖండ్ లోని జేఏఎం ప్రభుత్వం అనేక కుంభకోణాలు చేసి డబ్బు సమకూర్చుకుంటోంది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ బహిరంగంగా నన్ను బెదిరిస్తున్నాయి. మోదీని తొలగించి మళ్లీ స్కాంలు చేయాలనుకుంటున్నారు. జేఎంఎం, కాంగ్రెస్‌లు జార్ఖండ్‌ను అన్ని విధాలుగా లూటీ చేస్తున్నాయి. ఇక్కడ చాలా అందమైన పర్వతాలు ఉన్నాయి. కానీ జార్ఖండ్‌లో బయటపడుతున్న నోట్ల పర్వతాల గురించే దేశం మాట్లాడుతోంది. జేఎంఎం, కాంగ్రెస్ వ్యక్తుల ఇళ్లల్లో నోట్లకట్టలు పట్టుబడుతున్నాయి.
ఇంత డబ్బు మద్యం కుంభకోణం నుంచి, టెండర్ స్కాం నుంచి, మైనింగ్ స్కాం నుంచి వస్తోంది. ప్రతిపక్ష నేతలు సైనికుల భూమిని సైతం వదల్లేదు. భూములను లాక్కోవడానికి వారు తమ తల్లిదండ్రుల పేర్లను మార్చుకున్నారు. రాష్ట్రంలో పేదలు, గిరిజనుల భూములు కబ్జా అయ్యాయి. వీరి చెర నుంచి జార్ఖండ్‌కి విముక్తి లభించాలి‘అని మోదీ వ్యాఖ్యానించారు.ముస్లిం రిజర్వేషన్ అంశంపై ప్రతిపక్షాలపై విరుచుకుపడిన మోదీ తాను జీవించి ఉన్నంత కాలం ఓబీసీల రిజర్వేషన్లను లాక్కోలేరని అన్నారు. ‘ఇండియా కూటమి నేతలు ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తారు. మోదీ జీవించి ఉన్నంత కాలం గిరిజనులు, దళితులు, వెనకబడిన తరగతుల రిజర్వేషన్లను లాక్కోలేరు. హిందూ, ముస్లిం అంశం తీసుకొచ్చి నాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. కమలంపై ఎంత బురదజల్లితే అంత వికసిస్తుస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. జూన్ 1న చివరి దశ లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.