30-05-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, మే 30: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రికి రాష్ట్ర బీజేపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణలో బయటపడుతున్న గత ప్రభుత్వ కుంభకోణాలపై సీబీఐతో దర్యాప్తు జరపాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఢిల్లీలో విూడియాతో మాట్లాడుతూ.. వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించేలా రేవంత్ సర్కార్ కేంద్రాన్ని కోరాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా ఎందుకు విూనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ కుంభకోణాలను అడ్డుపెట్టుకుని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.
తెలంగాణలో ప్రతి వారం ఒక్కో కుంభకోణం వెలుగులోకి వస్తోందన్నారు. గత ప్రభుత్వ కుంభకోణాలు బయట పడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్‌ను రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. పౌరసరఫరాల శాఖలో జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. అక్రమాలు, కుంభకోనాలు వెలుగులోకి వస్తున్నా సీబీఐ దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం కోరకపోవడాన్ని ప్రభాకర్ తప్పుపట్టారు. సివిల్ సప్లైస్ కుంభకోణాన్ని సీబీఐతో దర్యాప్తు జరపాలన్నారు. అనేక ప్రముఖులు, జడ్జీలు ఫోన్ ట్యాపింగ్ అయ్యాయని వార్తలు వచ్చాయన్నారు. దుబ్బాక ఎన్నికల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాపింగ్ చేశారని, డీజీపీపై ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి చాలా తేలికగా తీసుకున్నట్లు కనిపిస్తోందన్నారు.
రాష్ట్ర అవతరణ వేడుక లకు సోనియాగాంధీని పిలవడంపై రాష్ట్ర బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. వందల మంది బలిదానాలకు సోనియా గాంధీయే కారణమని, తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ క్షమాపణలు చెప్పి దశాబ్ది వేడుకలకు రావాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహి స్తున్నపుడు అప్పటి ప్రధాని,పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చిన పార్టీలను ఎందుకు ఆహ్వానించడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన పార్టీలను ఆహ్వానించనప్పుడు అది పార్టీ కార్యక్రమం అవుతుందన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి సహా అనేక మంది బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని, ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ దర్యాప్తు లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
గతంలో డ్రగ్స్, పేపర్ లీకేజీల, నయిమ్ వ్యవహారం వచ్చినపుడు వాటిని కేసీఆర్ రాజకీయంగా ఉపయోగించుకున్నారన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం, ఉద్యమకారులు, తెలంగాణ వాదులతో చర్చలు జరపలేదని విమర్శించారు. సోనియాను పిలవడం ఆపి మిగతా పక్షాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. రాష్ట్ర చిహ్నం బయటకు వచ్చిన తరువాత రాష్ట్ర బీజేపీ నాయకత్వం సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటుందని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ స్పష్టం చేశారు.