30-05-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ/తిరువనంతపురం, మే 30: నైరుతి వచ్చేసింది. కేరళ తీరాన్నా గురువారం తాకింది. ఎండలతో అల్లాడుతున్న వేళ దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి వార్త అందించింది. నైరుతి రుతుపవనాలు గురువారం ఉదయం కేరళను తాకినట్లు ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. కేర సహా ఈశాన్య రాష్ట్రాలను నైరుతి పవనాలు తాకినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో కేరళవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 14 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వారంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించనున్నట్లు చెప్పారు. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతు పవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. నాలుగైదు రోజుల్లో రుతు పవనాలు రాయలసీమలోకి ప్రవేశించే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడిరచారు. వారం ముందుగానే రుతుపవనాల పురోగమనంతో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గతేడాది కంటే ఈసారి ముందుగానే నైరుతి పవనాలు కేరళను తాకాయి. దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. మన దేశంలో 52 శాతం నికర సాగుభూమికి ఇప్పటికీ వర్షపాతమే ఆధారమే. ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40 శాతం వ్యవసాయ ఉత్పత్తులు దిగుబడి అవుతాయి. అటు, ఈ ఏడాది లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడడం, ఆగస్ట్ - సెప్టెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్న క్రమంలో ఈసారి సీజన్ లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు గత నెలలోనే అంచనా వేశారు. వాయువ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
1951 నుంచి 2023 వరకూ ఎల్‌నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్‌లో తొమ్మిదిసార్లు మంచి వర్షాలు కురిశాయని.. ఈ ఏడాది కూడా రుతుపవనాలు కదలిక అనుకూలంగా ఉందని వివరించారు. సాధారణంగా ఈశాన్య భారతంలో జూన్ 5కు అటు, ఇటుగా రుతు పవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈసారి మే 30నే ప్రవేశించాయి. రేమాల్ తుఫాను ప్రభావంతో రుతు పవనాలు వేగంగా కేరళను తాకినట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.