30-05-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, మే 30: ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో 421 సార్లు మతపర, విభజనవాద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కులమతాల ఆధారంగా ఓట్లు అభ్యర్థించకూడదని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ.. వాటిని ఉల్లంఘించారన్నారు. అయినా ఇసి ఎలాంటి చర్యలు తీసుకోలదేన్నారు. తాము కొన్ని సందర్భాల్లో ఫిర్యాదు చేశామని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తుదిదశ ప్రచారానికి చివరిరోజైన గురువారం ఆయన దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విూడియాతో మాట్లాడారు. జూన్ 4న ప్రత్యామ్నాయ సర్కారు ఏర్పడేలా ప్రజలు తీర్పు ఇస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు. గత 15 రోజుల్లో మోదీ తన ప్రసంగాల్లో 232 సార్లు కాంగ్రెస్ పేరును ప్రస్తావించారు. 758 సార్లు సొంత పేరునే తలుచుకున్నారు. నిరుద్యోగ సమస్య గురించి మాత్రం ఒక్కసారి కూడా మాట్లాడలేదని ప్రధాని ప్రచార తీరును ఖర్గే ఎండగట్టారు. స్పష్టమైన ఆధిక్యంతో ’ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేస్తూ.. దేశానికి సమ్మిళిత, జాతీయవాద ప్రభుత్వాన్ని అందిస్తామన్నారు.
ప్రస్తుత ప్రభుత్వానికి మరోసారి అవకాశమిస్తే ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడం ఖాయమనే అభిప్రాయం ప్రజల్లోనూ వ్యక్తమవుతోందన్నారు. గాంధీపై సినిమా తీసేవరకు ఆయన గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఖర్గే కొట్టిపారేశారు. గాంధీ గురించి బహుశా ఆయన చదివి ఉండకపోవచ్చు. కానీ, మహాత్ముడు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఐరాస సహా వివిధ ప్రదేశాల్లో బాపూజీ విగ్రహాలు ఉన్నాయి. ఒకవేళ మోదీకి గాంధీ గురించి తెలియకపోతే.. రాజ్యాంగం గురించి కూడా పెద్దగా తెలియనట్లే. జూన్ 4 తర్వాత ఎలాగో చాలా ఖాళీ సమయం దొరుకుతుంది. అప్పుడు గాంధీ ఆత్మకథ చదివి, ఆయన గురించి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీజీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిరచారు. మహాత్మాగాంధీ గురించి సినిమా చూసిన తర్వాత చాలామంది తెలుసుకున్నారని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే స్పందిస్తూ.. ప్రధానమంత్రి చదువుకుని ఉంటే ఇలాంటి మాటలు చెప్పువారుకాదన్నారు. ఆయన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. గాంధీ గురించి ప్రధానికి తెలియకపోతే రాజ్యాంగం గురించి కూడా తెలియదని అన్నారు.
జూన్ 4 తర్వాత మోదీకి ఖాళీ సమయం దొరికితే గాంధీ ఆత్మకథ, సత్యంతో నా అనుభవాలు పుస్తకాలను తప్పక చదవాలన్నారు. ఇకపోతే ప్రధాని మోదీ రాజకీయాలు ద్వేషంతో నిండిపోయాయని ఖర్గే విమర్శించారు. ఈ ఎన్నికలు చిరకాలం గుర్తుండిపోతాయని ఖర్గే పేర్కొన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు కుల, మతాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి ఓట్లు వేశారన్నారు. మోదీ మాయమాటలను దేశ ప్రజలు నమ్మలేదన్నారు. జూన్4 తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం రాబోతుందని ఖర్గే తెలిపారు. కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం చేయడానికి వెళ్లడంపై ఖర్గే ఘాటుగా స్పందించారు. వివేకానంద కేంద్రంలో ధ్యానం చేయడం వల్లనో, గంగలో స్నానం చేయడం వల్లనో విజ్ఞానం లభించదని, చదువుకోవడం ద్వారా జ్ఞానం లభిస్తుందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను మతంతో ముడిపెట్టి బీజేపీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిందని ఖర్గే పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేశారన్నారు. మోదీ ప్రభుత్వం నియంతృత్వం వైపు వెళుతోందని, ఈ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తుందని ఖర్గే విమర్శించారు.