30-05-2024 RJ
జాతీయం
చండీఘడ్, మే 30: దశాబ్దాల తర్వాత కేంద్రంలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఆధ్యాత్మిక గురువు రవిదాస్‌ను స్మరిస్తూ పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయడానికి తనకు ఆయనే స్ఫూర్తిదాయకుడని మోడీ తెలిపారు. ఏడు దశల ఎన్నికల ప్రచారం ముగింపు రోజున ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగిస్తూ గడచిన పదేళ్లలో దేశం ఎవరూ ఊహించనంత అభివృద్ధిని సాధించిందని తెలిపారు. పేదల సంక్షేమమే తన ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా ఆయన ప్రకటించారు. ఇదే తాను గురు రవిదాస్ నుంచి పొందిన అతి గొప్ప స్ఫూర్తని ఆయన చెప్పారు.
జలంధర్, హోషియార్‌పూర్ ప్రజలకు ఉపయోగపడే ఆదంపూర్ విమానాశ్రయానికి గురు రవిదాస్ పేరు పెట్టాలన్నదే తన ఆకాంక్షని ఆయన చెప్పారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇదే తన చివరి ప్రచార సభని మోడీ తెలియచేస్తూ హోషియార్‌పూర్‌ను చిన్న కాశీగా పిలుస్తారని, ఇది గురు రవిదాస్ తపోభూమి అని చెప్పారు. వారణాసి నుంచి తాను ఎంపీగా ఉన్నానని, గురు రవిదాస్ ఇక్కడ జన్మించారని, అందువల్ల ఈ పుణ్యభూమి తన ఎన్నికల ప్రచారాన్ని ముగించడం గర్వకారణమని ఆయన తెలిపారు.
కాంగ్రెస్, ఇండియా కూటమిపై ఆరోపణలు గుప్పిస్తూ సర్జికల్ స్టైక్ర్‌కు వారు సాక్ష్యాలు అడిగారని, సైన్యం గురించి వారు ఏనాడూ ఆలోచించలేదని అన్నారు. ఆ పార్టీలు అధికాంలో ఉండగా ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశాయని ఆయన విమర్శించారు. అవినీతిలో కాంగ్రెస్ డబుల్ పిహెచ్‌డి చేసిందని ఆయన ఆరోపించారు. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్‌పై కూడా ఆయన ధ్వజమెత్తారు. పరిశ్రమలు, వ్యవసాయాన్ని ఆ పార్టీ నాశనం చేసిందని ఆయన ఆరోపించారు. వికసిత్ భారత్ స్వప్నం కోసం ప్రతి భారతీయుడు కట్టుబడి ఉన్నారని, ప్రజలు తనకు ఆశీస్సులు అందచేస్తున్నారని ప్రధాని తెలిపారు. జూన్ 1న పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు ఏడవ దశ ఎన్నికలలో పోలింగ్ జరగనున్నది.