30-05-2024 RJ
జాతీయం
ఒడిషా, మే 30: ఒడిషాలోని పూరీ జగన్నాథుడి చందనోత్సవం లో అపశ్రుతి చోటు చేసుకుంది. చందనోత్సవం కార్యక్రమం జరుగుతున్న సమయంలో బాణసంచా పేలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. బుధవారం రాత్రి పూరీలోని నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథుడి చందనోత్సవం నిర్వహించారు ఆలయ నిర్వాహకులు. దీన్ని వీక్షించేందుకు వేలాది మంది అక్కడికి తరలించారు. ఈ క్రమంలో కొందరు భక్తులు టపాసులు పేల్చారు. అయితే నిప్పు రవ్వులు బాణసంచా నిల్వ ఉంచిన చోటపడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. మరికొందరైతే ప్రాణాలు కాపాడుకునేందుకు పుష్కరిణిలో దూకారు.
గురువారం ఉదయం పుష్కరిణిలో గాలింపు చేపట్టారు అధికారులు. గాయపడినవారిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులతో సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘటనపై భక్తులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో రాజకీయాలు పూరి ఆలయం చుట్టూనే తిరిగాయి. దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోందని అంటున్నారు. అయినా రాజకీయాల్లో దేవుడ్ని తీసుకురావడం మంచిదికాదని అంటున్నారు.