30-05-2024 RJ
జాతీయం
భువనేశ్వర్, మే 30: అగ్నివీర్ పథకంతో జవాన్లను మజ్దూర్‌గా ప్రధాని మోదీ మార్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. ఈ అగ్నీవీర్ పథకాన్ని రద్దు చేస్తామని, జవాన్లను మళ్లీ సైనికులుగా మారుస్తామని ఆయన హావిూ ఇచ్చారు. దాంతో పాటు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. పూరీ జగన్నాథుడు మోదీకి భక్తుడని.. ఇటీవల ఓ బీజేపీ నేత ప్రకటించడం రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఒడిశా ప్రజలను అవమానించారని మండిపడ్డారు. ఒడిశాలోని భద్రక్ లోక్‌సభ పరిధిలోని సిములియాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఇవాళ రాహుల్ పాల్గొని.. మాట్లాడారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని ఆయన మాటిచ్చారు.
ఆహారధాన్యాలపై ఇండియా కూటమి ఎమ్మెస్పీని చట్టబద్ధం చేస్తుందని చెప్పారు. ఒడిశాలో బీజెడీ, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయన్న రాహుల్.. కేంద్రం ప్రభుత్వం తనపై 24 పరువు నష్టం, క్రిమినల్ కేసులు పెట్టిందని మండిపడ్డారు. అయినా కాషాయ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పారు. ఈ రెండు పార్టీలు పేద ప్రజల కోసం పనిచేయట్లేదని.. కేవలం ధనవంతుల కోసమే పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత.. రైతులు, నిరుద్యోగులు, యువకులు, మహిళల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడతామని రాహుల్ చెప్పారు. ఉపాధి కూలీల రోజు కూలీని రూ.250 నుంచి రూ.400కి పెంచుతామని తెలిపారు.