31-05-2024 RJ
జాతీయం
తిరుమల, మే 31: మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ ప్రముఖులంతా దైవ దర్శనం చేసుకుంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తన సతీమణి సోనాల్ షాతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన అమిత్ షా దంపతులు.. శ్రీవారి అభిషేకసేవలో పాల్గొన్నారు. అమిత్ షా దంపతులకు ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గత కొద్ది రోజులుగా అమిత్ షా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
కశ్మీర్ నుంచి తమిళనాడు వరకూ పర్యటించిన ఆయన ఎన్నికల ప్రచారం ముగియడంతో తిరుమల శ్రీవారి సన్నిధిలో గడపాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల తుది విడత ప్రచారం ముగియడంతో గురువారం సాయంత్రం 6.15 గంటలకు అమిత్ షా దంపతులు రేణిగుంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. రాత్రికి వకుళామాత అతిథిగృహంలో బస చేశారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించున్నారు. మధ్యాహ్నం తిరుమల నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు అమిత్ షా శ్రీవారిని దర్శించుకోవటానికి రావటం ప్రాధాన్యత సంతరించుకుంది.