01-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 1: హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర తగ్గింది. అంతర్జాతీయంగా చమురు ధరలు కాస్త దిగిరావడంతో 19 కిలోల సిలిండర్‌పై చమురు విక్రయ సంస్థలు రూ.69 తగ్గించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో దీని ధర రూ. 1676కు చేరింది. హైదరాబాద్‌లో ఈ ధర రూ.1925.5గా ఉంది. వాణిజ్య సిలిండర్ ధర ను తగ్గించడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. అంతకుముందు ఏప్రిల్ 1న రూ.30.5, మే ఒకటో తేదీన రూ.19 మేర తగ్గించారు. మరోవైపు, గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఈసారి కూడా ఎలాంటి మార్పు లేదు. 14.2 కిలోల సిలిండర్ ధర దిల్లీలో రూ.803, హైదరాబాద్‌లో రూ.855 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
అటు పెట్రోల్, డీజిల్ ధరలనూ సవరించలేదు. అటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ ధరలను కూడా చమురు సంస్థలు 6.5శాతం తగ్గించాయి. దీంతో దేశ రాజధానిలో కిలో లీటరు విమాన ఇంధన ధర రూ.6,673.87 తగ్గి రూ.94,969.01కి దిగొచ్చింది. మే 1న దీని ధరను స్వల్పంగా రూ.749.25 పెంచారు. అంతర్జాతీయ మార్కెట్లోని హెచ్చుతగ్గులకు అనుగుణంగా దేశీయంగానూ కంపెనీలు ప్రతినెలా పలు ఇంధన ధరలను సవరిస్తుంటాయి. స్థానిక పన్నులను బట్టి రాష్ట్రాల్లో వీటి ధరలు వేర్వేరుగా ఉంటాయి.