01-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 1: ఈ నెల 4 వ తేదీన వెలువడే లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఆందోళన అవసరం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. దేశ ప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోడీ వైపే ఉన్నారని చెప్పారు. ఇక, దేశంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని జోస్యం చెప్పుకొచ్చారు. ఎన్డీయే 400 సీట్లకు పైగా గెలుస్తుందనే ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశానికి మోడీ అవసరముందని ప్రజలు గ్రహించారు.. అందుకే, మాకు ఈ సారి భారీ మేజార్టీ రాబోతుందన్నారు. చింద్వారా సీటుతో సహా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో అన్ని స్థానాలను గెలుస్తాం.. రాజస్థాన్ లోనూ మెరుగైన ఫలితాలు వస్తాయని జేపీ నడ్డా వెల్లడిరచారు.
కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ధ్యానంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలపై కూడా జేపీ నడ్డా స్పందించారు.. వారికి ఆధ్యాత్మిక విషయాలు పూర్తిగా తెలియవు.. వారు కేవలం పొలిటికల్ టూరిస్టులు మాత్రమేనంటూ మండిపడ్డారు. కేవలం ఎన్నికల టైంలోనే మతపరమైన పర్యటనలు చేస్తారంటూ నడ్డా ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ఎన్నికలను వర్గీకరించి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాదిలోనే బీజేపీ అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని విశ్వాసం మాకు ఉందన్నారు. తెలంగాణ. తమిళనాడులో ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది.. ఇక్కడి ప్రజలు మోడీ నాయకత్వంలో కొత్త మార్పులను చూసేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పుకొచ్చారు.