01-06-2024 RJ
జాతీయం
ముంబై, జూన్ 1: ఇటీవల కాలంలో విమానాల్లో, విమనాశ్రయాల్లో ఆకతాయిలు బాంబులు పెట్టామని బెదిరింపు కాల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరిస్తున్నారు. మరోవైపు.. ఇప్పటికి వచ్చిన బెదిరింపు కాల్స్ అన్నీ ఫేక్ అని అధికారులు నిర్థారించారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరో విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో.. చెన్నై నుండి ముంబైకి వెళ్తున్న ఇండిగో 5314 విమానం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.ముంబైలో ల్యాండ్ అయిన అనంతరం.. విమాన సిబ్బంది ప్రోటోకాల్‌ను అనుసరించారు. భద్రతా ఏజెన్సీ మార్గదర్శకాల ప్రకారం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. ‘‘ప్రయాణికులందరూ సురక్షితంగా విమానం నుండి దిగారు. ప్రస్తుతం విమానం తనిఖీలో చేపట్టారు. అన్ని భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత, విమానాన్ని టెర్మినల్ ప్రాంతానికి తరలించనున్నారు’’ అని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.
వారం రోజుల వ్యవధిలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం ఇది రెండోసారి. అంతకుముందు మే 28న ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లే విమానంలో విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు నేపథ్యంలో.. విమానంలోని ప్రయాణికులను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ద్వారం ద్వారా కిందకు దించారు. ఈ సంఘటన వీడియో క్లిప్‌ల్లో ప్రయాణికులు, విమాన సిబ్బంది వారి సామానుతో స్లైడ్‌ల ద్వారా విమానం నుండి ఎలా దిగుతున్నారో చూపించాయి. అయితే.. భద్రతా మార్గదర్శకాల ప్రకారం, ప్రయాణికులు తరలింపు 90 సెకన్లలోపు జరగాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు తమ లగేజీని తీసుకెళ్లకూడదు. మరోవైపు.. ఢిల్లీ ఘటనలో భద్రతా మార్గదర్శకాలను విస్మరించడంతో ఇండిగో ఇద్దరు పైలట్లు, నలుగురు క్యాబిన్ సభ్యులను తొలగించింది.