02-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 2: కేంద్రంలో మూడోసారి అధికారం భాజపాదేనంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడడంతో కమలం పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. ముందే చెప్పిన విధంగా వందరోజుల భవిష్యత్ ప్రణాళికపై ప్రధాని మోడీ దృష్టి సారించారు. అధికారం చేపట్టగానే చేసే ప్రాధాన్యతాంశాలపై ఉన్నతస్థాయిలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కన్యాకుమారిలో దాదాపు 45గంటల పాటు ధ్యానం ముగించుకున్న ప్రధాని మోదీ.. వివిధ అంశాలపై సవిూక్షలతో ఆదివారం షెడ్యూల్ బిజీ బిజీగా కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశాక అమలు చేయాల్సిన ’తొలి 100 రోజుల’ ప్రణాళికపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. రెమాల్ తుపాను కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో వరదల ప్రభావంపై ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ తొలుత రివ్యూ నిర్వహించనున్నారు.
అనంతరం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల వల్ల అనేక రాష్టాల్ల్రో చోటు చేసుకుంటున్న మరణాలు, బాధిత కుటుంబాలకు సాయంపై సవిూక్ష చేయనున్నారు. వీటితోపాటు జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలపైనా ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత.. మొదటి 100 రోజుల కార్యాచరణపైనా ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ మేధోమథనం జరపనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని ఎన్నికలకు ముందే కేంద్ర మంత్రులకు సూచించారు. వంద రోజుల్లో అమలు చేయాల్సిన కార్యక్రమాల ప్రాధాన్యతాక్రమాన్ని రూపొందించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.