03-06-2024 RJ
జాతీయం
అహ్మదాబాద్, జూన్ 3: గుజరాత్‌కు చెందిన పాల కంపెనీ అమూల్ మరోసారి ధరలు పెంచింది. అన్ని రకాల ఉత్పత్తులపై రూ.2 మేర ధరలు పెంచినట్లు ’అమూల్’ బ్రాండ్‌తో డెయిరీ ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కో`ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. పెరిగిన ధరలు దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయని తెలిపింది. దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో అమూల్ ధరలు పెరగడం గమనార్హం. చివరిసారి అమూల్ 2023 ఫిబ్రవరిలో ధరలను సవరించింది. అప్పుడు కూడా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో డిసెంబర్ 2022లో కమలం పార్టీ విజయం సాధించిన తర్వాత ధరలను పెంచింది. పాల ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరిగిన కారణంగానే ధరల్ని సవరించాల్సి వస్తోందని జీసీఎంఎంఎఫ్ తెలిపింది.
తమ అనుబంధ పాల సంఘాలు రైతులకిచ్చే పరిహారాన్ని గత ఏడాది వ్యవధిలో 6`8 శాతం పెంచినట్లు పేర్కొంది. తాజా పెంపు వల్ల వారికి మరింత మెరుగైన ధర కట్టిచ్చేందుకు అవకాశం లభిస్తుందని వివరించింది. తద్వారా అధిక పాల ఉత్పత్తిని ప్రోత్సహించినట్లవుతుందని అభిప్రాయపడిరది. తాజా పెంపుతో అమూల్ బర్రె పాల ధర లీటరుకు రూ.73కి చేరుకుంది. అర్ధ లీటర్ రూ.27గా అయింది. రూ.66గా ఉన్న అమూల్ గోల్డ్ ధర రూ.68కి, అమూల్ శక్తి రూ.60కి చేరాయి. అమూల్ తాజా పాల ధర లీటర్ రూ.56కు పెరగగా, అర్ధ లీటర్ రూ.28కి చేరింది. ఇక అమూల్ గోల్డ్ అర్ధ లీటర్ రూ.34, అమూల్ శక్తి అర్ధ లీటర్ రూ.30గా అయ్యాయి. గతంలో అమూల్ పాల ధరలు పెరగడంతో ఇతర కంపెనీలు కూడా పెంచాయి. ఇప్పుడు కూడా ఇతర కంపెనీలు ఈ గుజరాతీ కంపెనీని ఫాలో అయితే వినియోగదారులపై మరింత భారం పడనుంది.