04-06-2024 RJ
జాతీయం
ముంబై, జూన్ 4: ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే, ఇండియా కూటమిల మధ్య హోరాహోరీ పోరుతో సోమవారం స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఎగ్జిట్ పోల్స్‌తో దూసకుపోయిన మార్కెట్లు ఇప్పుడు ఢమాల్ మన్నాయి. సెన్సెక్స్, నిప్టీలు తీవ్ర ఒడిదుడుకులతో సాగుతూ ఇన్వెస్టర్లు భారీ నష్టాలు మిగిల్చాయి. అంచనాలకు విరుద్ధంగా ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య భీకర పోరు సాగుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. మదుపరుల ఊగిసలాట మధ్య మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ప్రస్తుతం 5000 పాయింట్లుపైగా కుప్పకూలింది. పలు కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. స్టాక్ మార్కెట్ల పతనంతో ఒక్కరోజే రూ. 26 లక్షల కోట్ల విలువైన సంపద ఆవిరైంది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల మధ్య స్టాక్ మార్కెట్‌లో భారీ సందడి నెలకొంది. దీంతో స్టాక్ మార్కెట్‌లో రికార్డు పతనం ప్రభావం బంగారం, వెండి ధరలపై కనిపించింది. స్టాక్ మార్కెట్‌లో గందరగోళం ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ఈరోజు ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధర దాదాపు రూ.500 పెరిగింది. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.73,020కి పెరిగింది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.72,870కి చేరుకోగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,800కి చేరింది. మరోవైపు వెండి రేటు కూడా 500 రూపాయలు పెరిగింది. దీంతో నేడు ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.94,000కు చేరుకుంది.
హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 98500, ముంబైలో కిలో వెండి ధర రూ. 94,000, చైన్నైలో కిలో వెండి ధర రూ. 98500, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 94000, కేరళలో కిలో వెండి ధర రూ. 98,500కు చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆధారంగా బంగారం ధర ప్రతిరోజూ నిర్ణయించ బడుతుంది. అందుకు తగ్గట్టుగానే గత కొన్ని నెలలుగా బంగారం ధరల్లో మార్పు కనిపిస్తోంది. చైనా, రష్యా, సహా పలు దేశాలు డాలర్ల బదులు బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడం వల్ల బంగారం ధర పెరుగుతూ ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు బంగారం ధర పెరగడంతో మధ్యతరగతి, నగల వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.