05-06-2024 RJ
జాతీయం
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు బిజెపికి ముఖ్యంగా మోదీ ద్వయానికి ఓ హెచ్చరిక లాంటివి. తమకు తిరుగులేదని వ్యవహరిస్తున్న ఈ ఇద్దరు నేతలకు ఫలితాలు మింగుడు పడనివే. 400 సీట్ల లక్ష్యంతో ఎన్నికల సమరంలో దూకిన వీరు కనీస మద్దతును కూడా తెచ్చుకోలేక పోయారు. దీంతో అసలు సిసలు ఎన్‌డిఎ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడబోతోంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఇద్దరూ సంకీర్ణ ప్రభుత్వానికి కొత్త. గత రెండు పర్యాయాలు పూర్తి మెజార్టీతో పాలన చేపట్టిన మోదీ ద్వయం, ఎన్‌డిఎ మిత్రపక్షాలను పురుగుల్లా చూశారు. వారికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. పార్లమెంట్ లోపలా, బయటా వారికి విలువ ఇవ్వలేదు. కానీ ఇప్పుడలా కాదు. సంకీరణ ప్రభుత్వం ఏర్పాటులో అందరి అభిప్రాయాలను తీసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. అలాగే ఎందుకింత తక్కువగా సీట్లు సాధించారో కూడా చర్చించాలి. ప్రజలు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులను ఈ ఇద్దరూ ఏనాడూ చర్చించలేదు.
పార్టీ వేదికలపైనా ప్రస్తావించలేదు. తాము పట్టిన కుందేటికి మూడే కొమ్ములు అన్నచందంగా ముందుకు సాగారు. నిర్ణయం ఏకపక్షంగా తీసుకోవడం, అమలు చేయడం చేశారు. జిఎస్టీని అద్భుతమైన బ్రహ్మపదార్థంగా చూపారు. దానివల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులను పక్కన పెట్టారు. ఇన్‌కమ్ టాక్స్ బాధలను పట్టించుకోలేదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం గురించి చర్చించలేదు. అలాగే ధరల పెరుగుదల, మందుల ధరల పెరుగుదలను పట్టించు కోవడం లేదు. ఈ దేశంలో ఏం జరిగినా మాకెందుకులే అన్న రీతిలో పాలన సాగింది. ఇప్పుడీ వ్యవహారాలు సాగకుండా ఎన్‌డిఎ నేతలు కట్టడి చేయాలి. అసలుసిసలు సమస్యలపై నిర్మాణాత్మక దృష్టి పెట్టాలి. ముందుగా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం నెలకొల్పాలి. పార్టీ ఎంపిల అభిప్రాయాలను తీసుకోవాలి. పార్లమెంటులో విపక్షాల చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్ణయాలపై పార్లమెంటులో సమగ్రంగా చర్చించ డం అలవచర్చుకోవాలి.
ఇకపోతే విపక్షం కూడా ఇప్పుడు బలంగా ఉంది. గతంలో లాగా ఇష్టం వచ్చినట్లు చేద్దామంటే కుదరదు. ఎన్‌డీఏ కూటమి మరోసారి విజయం సాధించినా..పెద్దగా తమకు బలం లేదని, తాము సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నామని నరేంద్ర మోదీ గుర్తుంచుకుని పాలన సాగించాలి. ఇకపోతే మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా మోదీ తొలి ప్రధాని నెహ్రూ రికార్డు సమం చేయను న్నారు. ఈ క్రమంలో ఆనాడు నెహ్రూ సాధించిన విజయాలను గుర్తించి అందులో కొన్నయినా సాధించ గలగాలి. నదుల అనుసంధానం, వ్యవసాయ పురోభివృద్ది, ప్రాజెక్టుల నిర్మాణం వంటి విషయాల్లో గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. మిత్రపక్షాల సాయంతోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిరది కనుక వారి మాటలకు విలువ ఇవ్వాలి. అలాగే బిజెపిలోని ఎంపిలకు, సిఎంలకు విలువ ఇవ్వాలి.
ఉమ్మడి నిర్ణయాలతో ముందుకు సాగడం మోదీ అలవర్చుకోవాలి. నీతి ఆయోగ్‌ను బలోపేతం చేయాలి. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగు పర్చాలి. రాష్ట్రాలకు చట్టబద్దంగా ఇవ్వాల్సిన నిధులు విడుదల కావాలి. అభివృద్దికి సంబంధించిన పనులను వేగాంగా అమలు చేయడం అలవర్చుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల సంక్షేమం అన్నది ఉమ్మడిగా నిర్ణయించి ముందుకు సాగాల్సి ఉంది. పార్లమెంటులో సమస్యలపై చర్చించ లేదు. నీతి ఆయోగ్‌లోనూ ప్రధాని ప్రసంగానికే పెద్దపీట వేస్తున్నారు. హాజరైన సిఎంలు ప్రస్తావించిన అంశాలపై చర్చించడం లేదా, తదుపరి చర్యలు కానరావడం లేదు. మొత్తంగా దేశంలో కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్న కారణంగా ఇంతకాలం సమావేశాలు, చర్చలు అన్నవి తూతూ మంత్రంగా సాగాయి. సమావేశాలు, చర్చలు అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజల ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండా సాగాయి.
అనేక సందర్భాల్లో నీతి ఆయోగ్ సమావేశాల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ సమస్యలపై నేరుగానే ప్రశ్నించారు. ఆయా రాష్ట్రాల సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్లారు. అయినా లాభం లేకపోవడంతో ఇక సమావేశాలకు హాజరు కావడం దండగ అన్న భావనలో ఉన్నారు. నీతి ఆయోగ్ ప్రారంభించి సమయంలో కనిపించిన స్ఫూర్తి లోపించింది. నీతి ఆయోగ్ ఏర్పాటు దశలో ప్రధాని మోదీ ఆనాడు చేసిన ప్రకటనకు భిన్నంగా ఈ పదేళ్లుగా నీతి తప్పిన ఆయోగ్‌గా అవతరించింది. సహకార సమాఖ్య సూత్రాలకు అనుగుణంగా మొత్తం దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆయా రాష్ట్రాలకు తగిన గౌరవం ఇచ్చి వారిని కూడా ఇందులో భాగస్వాములను చేయాల్సి ఉంది. రాష్ట్రాలను కలుపుకుని ముందుకు సాగాల్సిన కేంద్రం ఆ దిశగా పనిచేయడం లేదు. మళ్లీ పాతపద్దతిలోనే సాగుతామంటే ఇప్పుడు కుదరదని మోదీ గుర్తించాలి.
రాష్ట్రాల సిఎంలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వారిచ్చే విలువైన సూచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వివిధ సమస్యలపై ప్రజలు అనేక సందర్భాల్లో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గవర్నర్ వ్యవస్థ ఇలా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం బదులు నానాటికి దిగజారుస్తున్నాయి. ప్రజల డబ్బు నీళ్లప్రాయంగా ఖర్చవుతోంది. రాజకీయాల్లో ఎదుటి పక్షాలను ఢీకొట్టేందుకు తమ తెలివిని ఉపయోగిస్తున్న పాలకులు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో శ్రద్ద చూపడం లేదు. ఈ దశలో ఇలాంటి ప్రజాస్వామ్యం కొనసాగితే మరో 75 ఏళ్లయినా మన భారత్ రాత మారదు. రాజకీయ సంస్కరణలు రావాలి. పాలకుల తీరులో మార్పు రావాలి. ప్రజాధనం వృధా ఖర్చులకు కళ్లెం పడాలి. ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులను పాలకుల విలాసాలకు ఖర్చు చేసుకుంటున్నారు.
రాజ్యంగం ఏ మేరకు ఎంతవరకు అమలు సాధించామన్నది పాలకులుగా రాజకీయ పార్టీల నేతలు మననం చేసుకోవాలి. అందరికీ సమ న్యాయం అందుతుందా అన్నది చూడాలి. ఉమ్మడి నిర్ణయాలతోనే ఇది సాధ్యమవుతుంది. అందువల్ల మోదీ ద్వయం ఇక సంకీర్న పాలనకు మానసికంగా సిద్దపడి ముందుకు సాగాలి. గతంలో లాగా ఏకపక్ష నిర్ణయాలు తగవని గుర్తించాలి. ప్రజల కోణంలో నిర్ణయాలు ఉండాల్సిందే. ఎన్‌డిఎ పక్షాలు కూడా పాలనపై పట్టు తప్పకుండా నిఘా పెట్టాలి.