07-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 7: దేశానికి మోదీ ఒక స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. మోదీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మోదీ స్ఫూర్తితో ఏపీలో అద్భుత విజయం సాధించామన్నారు. మోదీ వెనుక తామంతా ఉన్నామని ప్రకటించారు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీకి తమ పూర్తి మద్దతును పవన్ తెలిపారు.ప్రధాని మోదీ నాయకత్వానికి జనసేన పార్టీ మద్దతిస్తుందని పవన్‌కల్యాణ్ అన్నారు. విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ‘జనసేన తరఫున మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికీ భారత్ తలొగ్గదు. విూ నేతృత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నాం‘ అని పవన్ కల్యాణ్ అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు తుపాను అని ప్రత్యేకంగా అభినందించారు. దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన సందర్భంగా ఏపీ నేతలను కొనియాడారు. పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే ఎంపీల సమావేశం జరిగింది. కూటమి లోక్‌సభా పక్షనేతగా మోదీ పేరును భాజపా నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. భాగస్వామ్య పార్టీలు దీనికి మద్దతు పలుకుతూ మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందన్నారు. చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయం సాధించామన్న ఆయన.. ఆ సమావేశంలోనే ఉన్న పవన్‌ను అభినందించారు.