11-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 11: తూర్పు ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా (51) విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన భార్యతో సహా విమానంలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. మలావీ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా కార్యాలయం మంగళవారం నాడు ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. ఒకరోజు జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. సంఘటన వివరాల ప్రకారం, మలావీ మాజీ అటార్నీ జనరల్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు చిలిమా సహా మరో తొమ్మిది మంది సైనిక విమానంలో ప్రయాణిస్తుండగా సోమవారం అదృశ్యమైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్తర నగరమైన జుజులో విమానం ల్యాండ్ కావడంలో విఫలమైంది.
దీంతో రాజధాని లిలాంగ్వేకి తిరిగి రావాలని సందేశం అందింది. కానీ విమానం తిరిగి రాకుండానే అదృశ్యం కావడంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు పర్వత ప్రాంతంలో విమానం శకలాలను కనుగొన్నారు. ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడకపోవడంతో మలావీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇది అత్యంత హృదయవిదాకరమైన సంఘటన అని, ఈ విషయం తెలియజేయడానికి విచారం వ్యక్తం చేస్తున్నానని చక్వేరా తెలిపారు. ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా సహా 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా వెల్లడిరచారు. గల్లంతైన విమానం శకలాలను గుర్తించామని.. అందులో ఎవరూ ప్రాణాలతో లేరని తెలిపారు.
మలావీ ఉపాధ్యక్షుడు, మరో తొమ్మిది మందిని తీసుకెళ్తున్న సైనిక విమానం జూన్ 10న అదృశ్యమైంది. రాజధాని లిలోంగ్వే నుంచి బయలుదేరిన ఆ విమానం 370 కిలోవిూటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ప్రయాణ సమయం 45 నిమిషాలు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగవద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లిపోవాలని ఏటీసీ సూచించింది. ఈ క్రమంలోనే రాడార్‌తో విమానం సంబంధాలు తెగిపోయాయి. గల్లంతైన విమానం కోసం మలావీ సైన్యం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ వందల మంది సైనికులు, పోలీసులు, అటవీ అధికారులతో ముమ్మరంగా గాలించింది. పొరుగు దేశాల హెలికాప్టర్లు, డ్రోన్లను రంగంలోకి దించింది.
అంగోలా దేశ అంతరిక్ష కేంద్రం సహాయాన్ని కోరింది. అమెరికా, బ్రిటన్, నార్వే, ఇజ్రాయెల్ కూడా సహాయం అందించేందుకు ముందుకువచ్చాయని మలావీ ప్రభుత్వం వెల్లడిరచింది. ఈ క్రమంలోనే కూలిపోయిన విమాన శకలాలను గుర్తించినట్లు తెలిపింది.