12-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 12: అరబ్ దేశం కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో మంటలు చెలరేగి 41 మంది మృతిచెందారు. వీరిలో 40 మంది భారతీయులే కావడం మరింత విషాదకరం. జీవనోపాధి కోసం సొంతవాళ్లకు దూరంగా వచ్చి ఓ కంపెనీలో పనిచేస్తున్న వీరంతా ఇలా దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ మంగాఫ్ నగరంలోని ఓ ఆరు అంతస్తుల భవనంలో బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక విూడియా వెల్లడిరచింది. ప్రమాద సమయంలో భవనంలో 160 మంది ఉన్నారు. వీరంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిపింది. తొలుత కిచన్‌లో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే భవనమంతా వ్యాపించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనలో 35 మంది మంటల్లో కాలి సజీవ దహనమవ్వగా.. మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 40 మంది భారతీయులేనని జాతీయ విూడియా కథనాలు వెల్లడించాయి. ఈ ప్రమాదంలో మరో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 30 మంది భారతీయులే. ఘటన జరిగిన భవనం కువైట్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థకు చెందినదిగా తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలోని చాలా మంది నిద్రలో ఉన్నారు. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేశారు. 40 మందికి పైగా మరణించారని, మరో 50 మందికి పైగా బాధితులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిసిందన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే కువైట్‌లోని భారతీయ రాయబారి ఘటనా స్థలాన్ని సందర్శించారని.. బాధితులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ప్రమాదంపై కువైట్ అధికారుల నుంచి మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ ఆరా తీసారు. బాధితులకు సాయంపై అధికారులతో చర్చించారు. తెల్లవారుజామున కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున వ్యాపించాయి. భవనంలో మంటలు వేగంగా వ్యాపించడంతో చాలా మంది లోపల చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు కేరళీయులు మరణించినట్లు నివేదికలు వెల్లడించారు. దట్టమైన పొగతో ఊపిరాడక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
మరో 40మందికి పైగా సృహ తప్పి పడిపోయారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అందుపు చేశారు. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు‘ అని సీనియర్ పోలీసు కమాండర్ తెలిపారు. అగ్నిప్రమాదం కారణంగా 43 మంది ఆసుపత్రి పాలయ్యారని, వారిలో నలుగురు మరణించారని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పోలీసులు చెప్పిన 35 మరణాలకు అదనంగా నలుగురి మరణాలు ఉన్నాయా? అనేది స్పష్టంగా తెలియలేదు. మంటలను అదుపు చేశామని, ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.