13-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 13: కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో మధ్యాహ్నం 1:10 గంటల సమయంలో కేంద్ర పౌర విమానా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దేశంలో అత్యంత పిన్న వయసులో కేంద్ర కేబినెట్ మంత్రి పదవి రామ్మోహన్ చేపట్టారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీకాకుళం ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. సీఎం చంద్రబాబు తనకు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారన్నారు. తనపై నమ్మకంతో ప్రధాని నరేంద్ర మోదీ.. పౌర విమానయాన శాఖ అప్పగించారన్నారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్ని శాఖలను మోదీ కోరారని మంత్రి చెప్పుకొచ్చారు.
’కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. భగవంతుడు, మా నాన్న ఎర్రన్న నాయుడు ఆశీస్సులు నాకు ఉన్నాయి. బాధ్యత రావడానికి కారణమైన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, శ్రీకాకుళం తెలుగు ప్రజలకు ధన్యవాదాలు. పౌర విమానయాన శాఖ కేటాయించిన మోదీకి కృతజ్ఞతలు. దేశంలో, ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి సాధిస్తున్న రంగం విమానయాన రంగం. యువతకు బాధ్యత ఇస్తే సమర్ధవంతంగా నిర్వహిస్తారని మోదీ నాకు ఈ బాధ్యత అప్పగించారు. నా శాఖను సమర్ధవంతంగా నిర్వహిస్తాను. 100 రోజుల ప్రణాళిక తయారు చేస్తాం. 2047 నాటికి సివిల్ ఏవియేషన్‌లో ఏ కార్యక్రమాలు చేపట్టాలో ప్రణాళికలు రూపొందిస్తాం అని వివరించారు. అలాగే సామాన్య ప్రయాణికుల కోసం ఈస్ ఆప్ ఫ్లయింగ్‌పై దృష్టి పెడతాం.
పర్యావరణ హితంగా మంత్రిత్వ శాఖను నిర్వహిస్తాం. భవిష్యత్తులో 100 శాతం పర్యావరణ హితంగా మంత్రిత్వ శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తాం’ అని రామ్మోహన్ చెప్పారు. ’ఎయిర్ పోర్టుల నిర్మాణం వేగంవంతం చేస్తాం. సామాన్యులకు విమానయాన రంగాన్ని చేరువ చేస్తాం. విమానయాన రంగానికి పునాదులు వేసిన వ్యక్తి అశోక్ గజపతి రాజు. ఉడాన్ స్కిమ్ ద్వారా సామాన్యులకు విమాన ప్రయాణం చేరువైంది. జ్యోతిరాదిత్య సింధియా సూచనలు తీసుకున్నాను. డీజీ యాత్రను విమానాశ్రయా లకు విస్తరిస్తాం. సివిల్ ఏవియేషన్ ఆప్ ఇండియా బెస్ట్‌గా తీర్చిదిద్దుతాం అన్నారు. మోదీ, చంద్రబాబు విజనరీ లీడర్స్. వారిద్దరి లిడర్ షిప్‌లో పౌర విమానయాన శాఖను ముందుకు తీసుకువెళతాను.
భోగాపురం ఎయిర్ పోర్టును రికార్డు సమయంలో పూర్తి చేసి విమానాలు ల్యాండ్ చేస్తాం. విజయవాడ, తిరుపతికి కనెక్టివిటీ పెంచుతాం. రాజమండ్రి, కడప, కర్నూలు విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తానని వివరించారు. ఏవియేషన్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్‌ను ఏపీ నుంచి ప్రారంభిస్తాను. ఏపీ, తెలంగాణ సహా రాష్ట్రాల వారిగా విమానాశ్రయాల అభివృద్ధిని వేగవంతం చేస్తాం. విజయవాడ టెర్మినల్ నిర్మాణం పూర్తి చేస్తాం. విజయవాడ ఎయిర్ పోర్టు కనెక్టివిటీ పెంచుతాం’ అని కేంద్ర మంత్రి రామ్మోహన్ వెల్లడిరచారు.