14-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 14: మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరవాత కాంగ్రెస్‌లో మరోమారు ఆశలు చిగురిస్తున్నాయి. కొంచెం కష్టపడితే మోడీని గద్దె దించవచ్చన్న ధీమాలో ఉన్నారు. ఇప్పుడున్న ఎన్‌డిఎ పక్షాలను లాగితే ప్రభుత్వం తమే అన్న ఆలోచనలో కాంగ్రెస్ అగ్రనేతలు ఉన్నారు. మరోవైపు ప్రియాంకను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకని వచ్చే ప్రయత్నాలు దాదాపుగా ఖరారు అయ్యాయి. రాహుల గాంధీ వయనాడ్‌కు రాజీనామా చేస్తే అక్కడ ప్రియాంకను నిలబెట్టేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమచారం. వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ స్థానానికి రాజీనామా చేయనున్నారని, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ.. ఆ స్థానానికి ఇవాళో, రేపో రాజీనామా చేస్తారనే ప్రచారం నడుస్తోంది. దీనిపై రాహుల్ గాంధీ త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ రాహుల్ ఎంపీగా పోటీ చేశారు. ఈ రెండు చోట్లా రాహుల్ భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే, నిబంధన ప్రకారం.. ఎన్నికల ఫలితాలు విడుదలైన రెండు వారాల్లో ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో రాహుల్ గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఇటీవల వయనాడ్ నియోజకవర్గంలో పర్యటించారు రాహుల్.. వయనాడ్, రాయబరేలీ నియోజకవర్గ ప్రజలకు సంతోషంగా ఉండే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. మరి రాహుల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రాహుల్ గాంధీ వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేస్తే ఆ చోటు నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ కూడా అప్పుడే ప్రారంభమైంది.
వయనాడ్ నియోజకవర్గానికి రాహుల్ రిజైన్ చేస్తే.. అక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. లేదంటే కేరళకు చెందిన సీనియర్ నేతను అక్కడి నుంచి పోటీకి దించే అవకాశం కూడా ఉందంటున్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే యూపీలో కాంగ్రెస్ పుంజుకోవడం అనివార్యం. అందుకే.. రాహుల్ గాందీ రాయబరేలీ స్థానంలోనే కొనసాగాలని యూపీ కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. దీంతో రాహుల్ సైతం రాయబరేలీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో తాజాగా ప్రియాంకా వయనాడ్ నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతున్నది. రాహుల్ తన సోదరి కోసం వయనాడ్ స్థానానికి రాజీనామా చేయనున్నారని, దీంతో అక్కడ జరిగే ఉపఎన్నికలో ప్రియాంక పోటీచేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక.. అప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీచేస్తారని ప్రచారం జరిగింది. అమెకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో అదంతా ఒట్టి ప్రచారమేనని తేలిపోయింది. తర్వాత 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్ధినంటూ పేర్కొన్నారు కూడా. కానీ, తర్వాత ఆ మాటలను వెనక్కి తీసుకున్న ఆమె.. ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించారు. ఇక తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తన తల్లి సోనియా గాంధీ ఇన్నాళ్లూ ప్రాతినిథ్యం వహించిన రాయ్‌బరేలి నుంచి పోటీచేస్తారని అంతా అనుకున్నారు. కానీ అక్కడ రాహుల్ పోటీచేసి విజయం సాధించారు.
అయితే కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్.. వయనాడ్‌ను అట్టిపెట్టుకుని రాయ్‌బరేలి స్థానానికి రాజీనామా చేస్తారనే ప్రచారమూ జరిగింది. అయితే ఇప్పుడు వయనాడ్‌పూ ఆయన వదిలిపెడతారని చర్చ జరుగుతున్నది. దీంతో ఇక్కడ ప్రియాంకను నిలబెట్టి దక్షిణాదిలో మరింతగా ప్రచారం చేయాలని చూస్తున్నారు.