18-06-2024 RJ
జాతీయం
వారణాసి, జూన్18: గంగా మాత తనను దత్తత తీసుకుందని, అందుకే తాను వారణాసివాసుల్లో ఒకరినయ్యానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాశీ ప్రజలు తనను ఎంపీగా ఎన్నుకోవడమే కాకుండా వరుసగా మూడోసారి ప్రధానిని చేశారని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ప్రజాస్వామ్య దేశాల్లో మాత్రమే సాధ్యమన్నారు. 60 ఏళ్ల క్రితం ఇది జరిగిందని, అప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు సాధించిన హ్రాట్రిక్ సాధించలేదని చెప్పారు. ఎప్పటిలాగే ప్రజల కలలు, ఆంక్షాలను పండిచేందుకు తాను రేయింబవళ్లు పనిచేస్తానని చెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి వారణాసి ఎంపీగా మోదీ గెలిచిన తర్వాత తన నియోజకవర్గంలో మంగళవారం నాడు తొలిసారి పర్యటించారు. పీఎం`కిసాన్ పథకం కింద 17వ విడతగా రూ.20,000 కోట్లు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, వికసత్ భారత్‌కు రైతులు, యువత, మహిళా శక్తి, పేదలు నాలుగు కీలక స్తంభాలని, తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతులు, పేదలకు సంబంధించిన అంశంపైనే తొలి నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలను ప్రధాని ప్రశంసిస్తూ, 60 ఏళ్లలో ఒక ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలో రావడం ఇదే మొదటిసారని చెప్పారు. ఎన్నికల్లో 31 కోట్ల మంది మహిళా ఓటర్లు పాల్గొన్నారు, ప్రపంచం లోనే అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్న రికార్డు ఇదని చెప్పారు. ఈ సంఖ్య దాదాపు అమెరికా జనాభాతో సమానమని అన్నారు. భారత ప్రజాజ్వామ్యం పటిష్టత యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేసిన వారణాసి ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆసాధరణ తీర్పునిచ్చారని కొనియాడారు.
ప్రపంచంలోనే భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడేందుకు వ్యవసాయ వ్యవస్థ పాత్ర చాలా కీలకమని మోదీ అన్నారు. సదుద్దేశం, పట్టుదల, రైతుల సంక్షేమానికి పాటుపడటం ద్వారా ఇది సుసాధ్యమని చెప్పారు. గ్లోబల్ మార్కెట్‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, వ్యవసాయ ఎగుమతుల్లో ఎదురులేని స్థాయికి చేరుకోవాలని అన్నారు. ప్యాకేజీ ఫుడ్ గ్లోబల్ మార్కెట్‌లో ఇండియాను తిరుగులేని స్థాయికి తీసుకువెళ్లాలని, ప్రపంచంలో ప్రతి డైనింగ్ టేబుల్ వద్దకు మన భారతీయ ఫుడ్ ప్రొడక్ట్‌ను తీసుకువెళ్లాలన్నదే తన కల అని చెప్పారు. రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ’పీఎం`కిసాన్ సమ్మాన్‌నిధి’ 17వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం నిర్వహించిన ’పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్’ కార్యక్రమంలో విడుదల చేశారు.
దీంతో దాదాపు 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున రూ.20 వేల కోట్లు జమ కానున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో విజయం, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారణాసిలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. నరేంద్ర మోదీ ఈనెల 9వ తేదీన వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు పీఎంవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ’పీఎం కిసాన్’ 17వ వాయిదా చెల్లింపు దస్త్రంపైనే తొలి సంతకం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి ఈ పథకం అమలు చేస్తోంది. దీనికింద అర్హులైన రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.2వేలు చొప్పున మొత్తం రూ.6 వేలు పెట్టుబడి సాయంగా ఇస్తోంది.