19-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 19: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. మద్యం కుంభకోణంలో అరెస్టయిన కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనను కోర్టు ముందు హాజరు పరిచారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లుగా పేర్కొంది.
కేజ్రీవాల్ పీఎంఎల్‌ఏ కింద దాఖలు చేసిన ఛార్జిషీట్లలో ఆయన పేరు లేదని కేజ్రీవాల్ తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సైతం కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొన లేదన్నారు. కేజ్రీవాల్ కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయవచ్చని మే 10న సుప్రీం కోర్టు ఆదేశాల్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ అరెస్టు సమయం వెనుక దురుద్దేశం ఉందన్నారు.