22-06-2024 RJ
జాతీయం
పట్నా, జూన్ 22: కొన్నేళ్లుగా వాడుకలో ఉన్న ఓ వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటన బిహార్‌లో శనివారం చోటుచేసుకుంది. అయితే, ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ వారంలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. బిహార్‌లోని సివాన్ జిల్లాలోని గండక్ కాలువపై ఉన్న వంతెన మహారాజ్‌గంజ్ జిల్లాలోని పటేధి బజార్ మార్కెట్‌ను, దర్భంగాలోని రామ్‌గఢ్ పంచాయతీతో కలుపుతోంది. ఈ వంతెనపై నుంచి ప్రతిరోజూ వందల మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. కాగా శనివారం ఉదయం ఇది భారీ శబ్దంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ వంతెన దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించిందని, దీని నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లే కూలిపోయిందని, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
వంతెన కుప్పకూలడంతో గండక్ కాలువ విూదుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో స్థానికులు పొరుగు గ్రామాలకు వెళ్లడానికి చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుందని వాపోయారు. బిహార్‌లోని అరారియా జిల్లాలో బక్రా నదిపై రూ.కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఓ వంతెన ప్రారంభానికి ముందే కుప్పకూలింది. వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో రెండు వంతెనలు కూలిపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.