24-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 24: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్.. కార్యక్రమాలను ప్రారంభించారు. సభ్యులు రాజ్యాంగం మేరకు నడుచుకోవాలని సూచించారు. ఎన్నికలన సభ్యుల జాబితాను లోక్‌సభ సెక్రటరీ సభ ముందుంచారు. అలాగే రాహుల్ గాంధీ వయనాడ్‌కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అనంతరం సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు భర్తృహరితో రాష్ట్రపతి భవన్‌లో ప్రోటెం స్పీకర్‌గా రాష్ట్రపతి ముర్ము ప్రమాణం చేయించారు. లోక్‌సభా పక్ష నేతగా ప్రధాని మోదీ తొలుత ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పోడియం వద్దకు రాగానే ఎన్డీయే కూటమి సభ్యులంతా మోదీ, మోదీ అంటూ నినాదాలు చేశారు.
అనంతరం నామినేటెడ్ ప్యానల్ స్పీకర్లు ప్రమాణం చేశారు. అయితే విపక్ష ఎంపిలు కొందరు ఇందుకు ముందుకు రాలేదు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులతో ప్రొటెం స్పీకర్ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేయించారు. మంత్రుల్లో తొలుత రాజ్‌నాథ్ సింగ్ తరవాత అమిత్ షా, గడ్కరీ, శివరాజ్‌సింగ్ చౌహాన్‌లు వరుసగా ప్రమాణం చేశారు. తొలిరోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. 27న రాజ్యసభ కూడా ప్రారంభం కానుంది. అదే రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించ నున్నారు.
విపక్ష ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు సముదాయంలోని పాత భవనం వద్ద కలుసుకుని, అక్కడి నుంచి నూతన భవనం వరకు ర్యాలీగా వచ్చారు. మొన్నటివరకు మహాత్మాగాంధీ విగ్రహం ఉన్న ప్రాంతంలో రాజ్యాంగం చిరు ప్రతులను చేతపట్టుకుని కొంతసేపు నిరసన చేపట్టారు. అనంతరం వీరంతా ఒకేసారి లోక్‌సభకు వెళ్లారు. సభ ప్రారంభం కాగానే కేరళలోని వయనాడ్ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ రాహుల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం వయనాడ్‌ను వదులకుని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని ఆయన నిర్ణయించుకున్నారు.