24-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 24: కర్నాకట మాజీ సిఎం, కేంద్రమంత్రి హెచ్‌డి కుమారస్వామి కన్నడంలో ప్రమాణం చేశారు. తరవాత మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒరియాలో ప్రమాణం చేశారు. ప్రహ్లాద్ జోషి సంస్కృతంలో ప్రమాణం చేశారు. ఇక కేంద్రమంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన ఇవాళ పార్లమెంట్‌లో ఎంపీగా ప్రమాణం చేశారు. శ్రీకాకుళం నుంచి మూడోసారి ఎంపీగా విజయం సాధించిన రామ్మోహన్ ఇప్పుడు తొలిసారి కేంద్రమంత్రి అయ్యారు. గతంలో రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు కూడా కేంద్రమంత్రిగా దేశానికి సేవలు అందించారు. ఉత్తరాంధ్రకు చెందిన మరో ఎంపీ సైకిల్‌పై పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు.
విజయనగరం నుంచి విజయం సాధించిన కిలిశెట్టి అప్పలనాయుడు తనకు సీటు ఇచ్చి పార్లమెంట్‌లో కూర్చోబెట్టిన సైకిల్‌పైనే లోక్‌సభ సమావేశాలకు హజరయ్యారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణం చేశారు. ప్రధాని మోదీతో ప్రమాణస్వీకారాలు ప్రారంభమ య్యాయి. ఆ తర్వాత కేంద్ర మంత్రుల ప్రమాణాలు కొనసాగాయి. రెండ్రోజుల పాటు ఎంపీలు సభలో ప్రమాణం చేయబోతున్నారు. తొలి రోజు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్టాల్ర ఎంపీలు తెలుగులో ప్రమాణం చేయడం విశేషం.
తొలుత ఎన్డీయే మంత్రివర్గంలోని కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి (భాజపా), కింజరాపు రామ్మోహన్ నాయుడు (తెదేపా), పెమ్మసాని చంద్రశేఖర్ (తెదేపా), బండి సంజయ్ (భాజపా), భూపతిరాజు శ్రీనివాసవర్మ (భాజపా) తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిమండలి సభ్యుల ప్రమాణం పూర్తయిన తర్వాత ఆంగ్ల అక్షరమాల క్రమం ప్రకారం రాష్టాల్రకు చెందిన ఎంపీలు ప్రమాణం చేశారు. తొలుత ఏపీ ఎంపీలకు అవకాశం రాగా.. అందులోనూ కొందరు ఎంపీలు తెలుగులో ప్రమాణం చేశారు. వీరిలో మతుకుమిల్లి శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్ (చిన్ని), లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు. మిగతావారు హిందీ, ఇంగ్లీష్‌లలో ప్రమాణం చేశారు. ఇక, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెదేపా ఎంపీ అప్పలనాయుడు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పంచెకట్టులో తొలిరోజు సభకు హాజరయ్యారు.