24-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 24: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఆయన వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క ఉన్నారు. వీరితో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ జత కలిశారు. ఆయన సోమవారం ఢిల్లీ వెళ్ళారని సమాచారం. ముఖ్యనేతలంతా ఢిల్లీలో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అలాగే పిసిసి చీఫ్‌ను మారుస్తారని అంటున్నారు. కొందరు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారికి ఏమైనా పదవులు కట్టబెడతారా అన్నది కూడా ఆసక్తిగా మారింది. ఆ అంశంపై ఢిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. మంత్రి పదవి కోసం ఆశవాహులు చాలా మంది ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస రెడ్డికి బెర్త్ ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. సామాజిక సవిూకరణాల ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ, పార్టీలో చేరికల గురించి హైకమాండ్‌తో సీఎం రేవంత్ కాంగ్రెస్ అగ్రనేతలతోచర్చిస్తారు.
ఇటీవలే పోచారం శ్రీనివాస రెడ్డి, తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరారు. 20 మంది వరకు పార్టీలో చేరతారని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతోపాటు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి ఈ నెల 27వ తేదీతో ముగియనుంది. కొత్త పీసీసీ చీఫ్ నియమించాల్సి ఉంది. సీఎం పదవితోపాటు పీసీసీ చీఫ్ పదవి ఒకరికే ఇవ్వరు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్.. పీసీసీ చీఫ్‌గా ఇన్నాళ్లూ కొనసాగారు. మరొకరికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం కేంద్రమంత్రులను సమయం కోరిందని తెలిసింది. విభజన హావిూల అమలు, ఇతర అంశాల గురించి కేంద్రమంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ చర్చించే అవకాశం ఉంది.