24-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 24: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం తన ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీ బిజీగా గడిపారు. అందులో భాగంగా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరంలో బీఎల్‌సీ మోడల్‌లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రమంత్రి ఖట్టర్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. అలాగే నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని మంత్రి ఖట్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇక రాష్ట్రంలో తాము నిర్మించదలచిన 25 లక్షల ఇళ్లలో 15 లక్షల ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని.. వాటిని లబ్దిదారు ఆధ్వర్యంలోని వ్యక్తిగత గృహ నిర్మాణం (బీఎల్‌సీ) పద్థతిలో నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రికి రేవంత్ వివరించారు. ఆర్థిక సంవత్సరంలో బీఎల్‌సీ మోడల్‌లో తెలంగాణకు 2.70లక్షల ఇండ్లను మంజూరు చేయాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కేంద్రమంత్రిని సీఎం ఆయన నివాసంలో సోమవారం కలిశారు. పేదలకు సొంత స్థలాల్లో 25లక్షలు ఇండ్లు నిర్మించాలని నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయించిన ఇండ్ల 15లక్షల ఇండ్లు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని.. వాటిని లబ్దిదారు ఆధ్వర్యంలోని వ్యక్తిగత ఇండ్ల నిర్మాణం పద్ధతిలో నిర్మించనున్నట్లు మంత్రికి వివరించారు.ప్రధానమంత్రి ఆవాస యోజనను (పట్టణ)`పీఎంఏవై (యూ) కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకున్నందున, 2024-25 సంవత్సరానికి పీఎంఏవై (యూ) కింద మంజూరు చేసే ఇంటి నిర్మాణ వ్యయం నిధులు పెంచాలని, రాష్ట్రంలో తాము నిర్మించే ఇళ్లను పీఎంఏవై (యు) మార్గదర్శకాల ప్రకారం నిర్మిస్తామని వివరించారు. పీఎంఏవై (యూ) కింద ఇప్పటి వరకు తెలంగాణకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి రూ.2,390.58 కోట్లు గ్రాంట్‌ను ప్రకటించారని సీఎం గుర్తు చేశారు.
అయితే, ఇందులో ఇప్పటి వరకు కేవలం రూ.1,605.70 కోట్లు మాత్రమే విడుదల చేశారని.. మిగతా నిధులు విడుదల చేయాలని కోరారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద చేపట్టే పనులు పూర్తి కానుందున మిషన్ కాల పరిమితిని 2025, జూన్ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద తెలంగాణలో వరంగల్, కరీంనగర్ నగరాల్లో పనులు చేపట్టినట్లు ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మిషన్ కింద వరంగల్‌లో 45 పనులు పూర్తయ్యాయని.. రూ.518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయన్నారు. కరీంనగర్‌లో 25 పనులు పూర్తయ్యాయని, రూ.287 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 పనులు కొనసాగు తున్నాయని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితి ఈ ఏడాది జూన్ 30తో ముగుస్తోందని, ప్రజా ప్రయోజనార్థం పనులు ముగిసే వరకు మిషన్ కాలపరిమితిని మరో ఏడాది పొడిగించాలని కోరారు.