25-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 25: తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన లోక్ సభ ఎంపీ గోపినాథ్ పార్లమెంటులో తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. లోక్ సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం రెండో రోజూ కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. అనేక మంది ఎంపీలు తమ మాతృ భాషలో ప్రమాణం చేశారు. తమిళనాడు, పుదుచ్చేరి కి చెందిన 40 మంది ఎంపీలు లోక్ సభ రెండో మధ్యాహ్నం 2.15 గంటలకు ఒక్కొక్కరుగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా కృష్ణగిరి ఎంపీ తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. తమిళనాడులోని కృష్ణగిరి ఆంధప్రదేశ్ ను ఆనుకుని ఉంటుంది. ఇక్కడ తమిళులు ఎక్కువే అయినప్పటికీ, తర్వాతి స్థానాలలో తెలుగు, కన్నడ వారు అధికంగా నివసిస్తుంటారు. తమిళనాడు నుంచి బెంగళూరుకు వెళ్లే దారి మధ్యలో ఉంటుంది ఈ కృష్ణగిరి.
ఈ సందర్భంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమిళనాడు నుంచి ఎంపీగా గెలుపొందిన కె.గోపీనాథ్ తెలుగులో ప్రమాణస్వీకారం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. కృష్ణగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించిన ఆయన.. రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. చివరలో జై తమిళనాడు అని నినాదం చేశారు. గతంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికైన సమయంలోనూ ఆయన తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు. అంతేకాకుండా పలు అంశాలపై తెలుగులోనే అడగ్గా.. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత తెలుగులోనే సమాధానాలు ఇచ్చేవారు. మహారాష్ట్రకు చెందిన పలువురు సభ్యులు మంగళవారం ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు.
ఎన్సీపీ (ఎస్‌పీ) ఎంపీ సుప్రియా సూలే ప్రమాణస్వీకారం అనంతరం ప్రొటెం స్పీకర్ భర్తృహరి కాళ్లకు నమస్కరించారు. అనంతరం భాజపా సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆశీస్సులు తీసుకున్నారు. మహారాష్ట్ర ఎంపీలు ప్రమాణస్వీకారం తర్వాత జైహింద్, జై మహారాష్ట్ర, జైభీం, జై శివాజీ అంటూ నినాదాలు చేయగా.. ప్రమాణస్వీకార పత్రంలో ఏముందో అదే చెప్పాలని ప్రొటెం స్పీకర్ సభ్యులకు సూచించారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 262మందితో ప్రమాణస్వీకారం చేయించగా.. మిగతా సభ్యుల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది.