26-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 26: చాలాకాలం తరవాత పార్లమెంటులో అధికార, విపక్షం గట్టిగా ఉన్నాయి. దాదాపుగా ఇరు పక్షాల బలాబలాలు ఇంచుమించు సమానంగా ఉన్నాయనే చెప్పాలి. ఈ క్రమంలో విపక్షాలు బలంగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. లోక్‌సభలో చర్చలకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడమే గాకుండా, బాధ్యతాయుంగా సమాధానం ఇవ్వగలగాలి. ఈ క్రమంలో లోక్‌సభలో విపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నియమితులయ్యారు. ఆయనపై ఇప్పుడు గురుతర బాధ్యత ఉంది. ప్రభుత్వం సక్రమ మార్గంలో నడిచేలా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సమర్థంగా పనిచేయాలి. ప్రభుత్వం చేసే తప్పుడు పనులను ఎత్తి చూపాలి. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. మోదీని దీటుగా ఎదుర్కొనే సమర్థనేత రాహుల్ ఒక్కడేననే అభిప్రాయంతో ఈ నెల 9న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం కూడా విపక్ష నేత విషయంలో ఏకగ్రీవంగా తీర్మానించింది.
కాంగ్రెస్ అగ్రనేతల ఒత్తిడితో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండేందుకు రాహుల్ తన ఆమోదాన్ని ప్రకటించారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రొటెం స్పీకర్ భర్తృహరికి రాహుల్‌ను తమ పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్ష నేతగా పేర్కొంటూ లేఖ రాశారు. గడిచిన పదేళ్లుగా లోక్‌సభలో విపక్ష నేత హోదా ఖాళీగా ఉంది. ఏదైనా పార్టీ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందాలంటే.. మొత్తం సీట్లలో 10 శాతం స్థానాల్లో గెలిచి ఉండాలి. ప్రస్తుతం లోక్‌సభలో 543 సీట్లున్నాయి. అంటే.. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే 54 సీట్లు తప్పనిసరి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభంజనంతో.. కాంగ్రెస్ 44 సీట్లతో సరిపెట్టుకుంది. 2019లో కూడా కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలను దక్కించుకోగా.. ప్రధాన ప్రతిపక్ష హోదాకు రెండు సీట్లు తక్కువ య్యాయి. ఈ సారి 99 మంది ఎంపీలుండడంతో.. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతకు ప్రత్యేక సభాహక్కులుంటాయి.
లోక్‌సభలో సభ్యులకు సీట్లు, గదుల కేటాయింపులు, అధికారిక పత్రాల సరఫరా, పార్లమెంటరీ కమిటీల నియామకం, సభ రోజువారీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తారు. సీబీఐ చీఫ్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్, కేంద్ర సమాచార హక్కు కమిషనర్, ఎన్నికల ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకానికి సంబంధించిన ప్యానెళ్లలోనూ ప్రధాన ప్రతిపక్ష నేత సభ్యుడిగా ఉంటారు. వీటితోపాటు.. లోక్‌సభలో ప్రజల గళాన్ని వినిపించే అవకాశం విపక్ష నేతకు ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో సభలో అనేక అంశాలను చర్చించేందుకు ఎజెండాను సెట్ చేసే అవకావం కూడా వస్తుంది. అనేక అంవాలపై చర్చను ఇప్పుడు రాహుల్ చేపట్టాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం కూడా ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం మానుకోవాలి. సంస్థలను బలోపేతం చేస్తూ..నిరుద్యోగ సమస్యలను పరిష్కరించగలగాలి. ఉచిత పథకాల పేరుతో వేలకోట్ల వృధాను అడ్డుకోవాలి. ఉచిత పథకాలపై దేశవ్యాప్త చర్చసాగాలి.
అలాగే ఉచితాలతో మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న రాష్టాల్ర ముఖ్యమంత్రులను కట్టడి చేయాలి. విద్వేషాగ్నులు పెచ్చరిల్లేలా విదేశీ గడ్డపై నుంచి వస్తున్న సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ప్రజలు, ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి అండగా నిలవాలి. విపక్షాలు ఇక కాశ్మీర్‌పై విమర్శలు కట్టిపెట్టాలి. కలసికట్టుగా ముందుకు సాగాలి. ఆనాటి పాలకుల దూరదృష్టి లోపం కారణంగా మనకు వారసత్వంగా వచ్చిన సకల అవలక్షణాలు ప్రజలను ఇంకా దరిద్రంలోనే ముంచెత్తుతున్న వేళ పాలకులు గతాన్ని నెమరేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇంతకాలం ఎక్కడ లోపం ఉందో గుర్తించి అవలోకనం చేసుకోవాలి. జోడో యాత్రల సందర్భంగా రాహుల్ అనేక వర్గాలను కలిశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కూడా నిరుద్యోగిత, ధరల పెరుగుదల, మహిళా సమానత్వం, సామాజిక న్యాయంపై హావిూలు ఇచ్చింది. ఈ అంశాలపై పార్లమెంట్‌లో గళమెత్తాల్సిన అవరముంది. అది ప్రతిపక్షనేతగా రాహుల్ తన సామర్థ్యాన్ని ప్రదర్శించాలి.