28-06-2024 RJ
జాతీయం
ఇందిర ఎమర్జెన్సీని పదేపదే ప్రస్తావించి..కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్న ప్రధాని మోదీ.. ఆర్థిక సంస్కరణలపైనా ఇదే విధానం అవలంబిస్తే బాగుండేది. దార్శనికుడు దివంగత ప్రధాని పివి నరసింహారావు అనుసరించిన ఆర్థిక విధానాలను అవలోకనం చేస్తే మంచిది. ప్రపంచానికి ఆదర్శంగా మన ఆర్థిక విధానాలు అవలంబించి...కొడిగట్టిన భారత ఆర్థిక వ్యవస్థను దేదీప్యమానంగా వెలిగించిన మహాను భావుడు పాములపర్తి వెంకట నరసింహారావు అనడంలో సందేహం లేదు. గత పదేళ్లుగా దేశ అర్థికరంగం కుదేలయ్యింది. జిఎస్టీ గురించి పదేపదే గొప్పుల చెబుతున్న మోడీ రాష్ట్రపతి ప్రసంగంలోనూ దీనిని మరోమారు ప్రస్తావించారు. కానీ క్షేత్రస్థాయిలో జిఎస్టీ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. డాలర్ మారకం రేటు పెరుగుతోంది. వడ్డీరేట్లు పెరుగుతున్నాయి.నిత్యావసర ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో పరిశీలన చేసే ఓపికా, చిత్తశుద్ది ప్రధాని మోడీకి లేదు.
ఆయనకు ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం బతికి బట్టకట్టేలా లేదు. సామాన్యులు దర్జాగా బతకగలిగిన నాడే జిడిపి లెక్కలు బాగున్నట్లు గుర్తించాలి. సామాన్యులు ఇల్లు కట్టుకున్ననాడే మన ఆర్థిక వ్యవస్థ బాగున్నట్లుగా గుర్తించాలి. ఇవన్నీ మోడీకి తెలియవా అంటే తెలుసు. కానీ తెలుసుకుని బాగుచేద్దామన్న సంకల్పమే కానరావడం లేదు. మోడీ ఆర్థిక విధానాలపై వారి లెక్కలు వారికి ఉన్నాయి. వారంతా మేం బ్రహ్మాండగా పాలిస్తున్నామని అనుకుంటున్నారు. పదేళ్ల తరవాత కూడా చావుదప్పి కన్నులొట్టబోయినట్లుగా, బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చినా... ప్రజలంతా మోడీకి జై కొట్టారని భావిస్తున్నారు. కానీ మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్యులకు చేటుగా మారాయి. ఉదాహరణకు జిఎస్టీకి సంబంధించి తీవ్ర ప్రభావం చూపుతున్న నిర్ణయాలపై చర్చించడం లేదు.
అప్పు చేసి, పొదుపు చేసుకుని హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కడుతున్నవారు జిఎస్టీ రూపంలో భారీగగా పన్నులు కట్టి నష్టపోతున్నారు. పాలసీలపై బాదుడు దారుణంగా ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలు చెమటోడ్చి కడుతున్న పాలసీలపై 18 శాతం జిఎస్టీ కట్టించుకుంటున్నారు. ఇంతమొత్తంలో కట్టడం వల్ల సామాన్యులు కుదేలవుతున్నారు. దీనిపై ఎవరు కూడా చర్చించడం లేదు. ఇలాంటి బాదుళ్లు ఎన్నో ఉన్నాయి. వీటిని ఎక్కడా చర్చించడం లేదు. రాజనీతిజ్ఞత,ఆర్థిక సంస్కరణాలాభిలాష అన్నవి ప్రతిభ ఉండి అమలు చేయగల ధైర్యం ఉన్న నేతకు మాత్రమే సొంతం. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటికి దేశాన్ని కుదిపి వేస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని చాకచక్యం గా పరిష్కరించి, దేశానికి బంగారు బాట వేసిన ధీశాలి పివి నరసింహారావు. దేశానికి అవసరమైన ఆర్థిక, రాజకీయ సంస్కరణలతో ముందుకు సాగిన రాజనీతిజ్ఞుడు పీవీ. కానీ ఆయన సంస్కరణలను మరింత ముందుకు తీసుకుని వెళ్లేలా తరవాతి ప్రభుత్వాలు విఫలం అయ్యాయి.
పదేళ్లపాటు యూపిఎ ప్రభుత్వంలో ప్రధానిగా ఉన్న నాటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ కూడా మళ్లీ వీటిని సమర్థంగా ముందుకు తీసుకుని వెళ్లలేకపోయారు. నేటి ప్రధాని మోడీ హయాంలో కూడా ఆర్థిక విధానాలు సక్రమంగా అమలు కావడం లేదు. తాను తీసుకుని వచ్చిన జిఎస్టీ గురించి గొప్పలు చెప్పడమే తప్ప అవి ప్రజలపై ఏ మేరకు విష ప్రభావం చూపుతున్నాయో గమనించడం లేదు. బిజెపిలో ఉన్న నేతలు కూడా దీనిగురించి చర్చించడం లేదు. ఇప్పుడు ఎన్‌డిఎ పక్షాలు అయినా ఈ జిఎస్టీ బాదుడు గురించి చర్చించాలి. లేకుంటే వారిని కూడా ప్రజలు క్షమించారు. ఆర్థిక సంస్కరణ అన్నది ప్రజలను కష్టాలు, నష్టాల నుంచి గట్టెక్కించేలా ఉండాలి. కానీ జిఎస్టీతో కష్టాలు, నష్టాలే తప్ప ప్రజలకు ఒనగూరు తున్న ప్రయోజనం లేదు. బ్యాంకులు దివాళా తీయడం మొదలు, బ్యాంకులకు లక్షల కోట్లు ఎగవేసిన కొందరు విదేశాలకు ఉడాయించారు. ఇలాంటి మోసాలను నిరోధించేలా మోడీ చర్యలు తీసుకోలేక పోయారు.
మరో పదేళ్లు మోడీ అధికారంలో ఉన్నా ఇవి సాధ్యపడవని గుర్తించాలి. బ్యాంకులకు రుణాలను ఎగవేసి, దేశాన్ని ముంచేసి పారిపోయిన వారిని వెనక్కి రప్పించి కఠిన చర్యలు తీసుకోవడంలో మోడీ విఫలం అయ్యారు. ఎందరో ఎంపిలు, మంత్రుల్లో ఆర్థిక ఎగవేతదారులుగా ఉన్నా వారిపై చర్యలు తీసు కోవడం లేదు. అందుకే ఆనాటి పరిస్థితులను నేటితో పోల్చుకోవాల్సి వస్తుంది. పివి తీసుకున్న నిర్ణయాల వల్ల సామాన్యులకు ఎంతో మేలు జరిగింది. ఆధునిక భారతంలో ఆర్థిక సంస్కరణలను మనదేశం అవలబిం చడం వల్లనే ఇవాళ మనమంతా ఈ స్థితిలో ఉన్నాం అని చెప్పుకోవడానికి దివంగత ప్రధాని పివి నరసింహా రావును నిత్యం స్మరించుకోవాల్సింది. ఆర్థిక సంస్కరణలను ప్రతిపాదించినప్పుడు యధావిధిగానే కమ్యూనిస్టులు వ్యతిరేకించారు. అయితే ఆయన ధైర్యంగా వీటిని ముందుకు తీసుకుని వెళ్లి అమలు చేసిన ధీశాలి.
పివి సంస్కరణలతో ప్రపంచంతో వాణిజ్యం పెరగడమే గాకుండా,మన యువత విదేశాలకు చదువులకు, ఉద్యోగాలకు వెళ్లగలిగే అవకాశాలను అందిపుచ్చుకున్నారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు, ఊహించని రీతిలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి మార్కెట్ సరళీకరణ విధానాన్ని రూపొందించి భారత్‌కు మార్గాన్ని చూపారు. ఇప్పుడా మార్గంలోనే మన ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. ఆయన చూపిన బాట నుంచి పక్కకు తప్పినప్పుడల్లా మళ్లీ సంక్షోభాల ఎదుర్కొంటున్నాం. సంక్షోభ సమయంలో, ఆర్థిక వ్యవస్థ గాడితప్పుతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ పీవీ ఆర్థిక సంస్కరణలే గుర్తుకువస్తున్నాయి. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వాలు కలిగిన వారు బహు అరుదుగా వస్తుంటారని పివి ఆనాడే నిరూపించారు. అలాగే పదవుల కోసం వెంపర్లాడుతున్న నేటి రాజకీయాల్లో పదవులు వాటంతటవే వెతుక్కుంటూ రావడం...వాటికి వన్నె తేవడం కూడా పివికి మాత్రమే దక్కింది.
ఆనాడు పివి అనే మహానుభావుడు ప్రధాని కాకుంటే భారత ఆర్థికస్థితి ఏమయ్యేదో అన్న భయం ఇప్పుడు కలుగుతోంది. అలాంటి మహానుభావుడు పివి రూపంలో భారతదేశానికి సాక్షాత్కరించడం కూడా దేశం చేసుకున్న అదృష్టంగా చూడాలి. భారతదేశ ఆర్థికి స్థితిగతులను బేరీజు వేసుకున్నప్పుడు పివికి ముందు పివి తరవాత అన్న లెక్కలు వేసుకునే స్థితి మనది. రాజకీయాల్లో రాణించడం కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తూ..ఎదుటి వారిని బురిడీ కొట్టించడం అవసరమైతే ప్రత్యర్థులను మట్టుపెట్టడం లాంటి నేటితరం రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వం కలిగిన మహానుభావుడు దివంగత పివి నరసింహారావు. ఆయన పాలనా సంస్కరణలతో దేశానికి అలాగే కాంగ్రెస్ పార్టీకి చరిత్రలో లిఖించదగ్గ ఘట్టాలను అందించారు.
రాజకీయాల్లో స్థితప్రజ్ఞత ఉన్న అరుదైన నేతల్లో పివి ముందుంటారు. ఆయన స్వార్థం కోసం ఏనాడూ రాజకీయాలు చేయలేదు. అలాగే ఆయనలోని స్వార్థం దేశానికి మంచి చేయాలన్న తపన తప్ప మరోటి కాదు. అపర చాణుక్యుడు అంటూ ఆయనను కీర్తించినా రాజకీయాల కోసం తన చాణక్యాన్ని ఎప్పుడూ ప్రదర్శించలేదు. రాజకీయాలను ఆమూలాగ్రం ఔపోసన పట్టిన ఘటికుడు ఆయన. అందుకే వాటిని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా పాలన చేసి..తిరుగలేని నేతగా రుజువు చేసుకున్నారు.